హైదరాబాద్, సెప్టెంబర్27 (నమస్తే తెలంగాణ): బతుకమ్మ, దసరా ఇంటిల్లిపాది సంతోషంగా జరుపుకునే పండుగ. ఈ పండుగ పూట కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ సిబ్బందిని పస్తులు పెడుతున్నది కాంగ్రెస్ సర్కారు. రాష్ట్రంలో గిరిజన సంక్షేమశాఖ ఆధ్వర్యంలో 268 ఆశ్రమ పాఠశాలు (Ashram Schools) ఉన్నాయి. అందులో ‘రెగ్యులర్ ఉపాధ్యాయులు, కాంట్రాక్టు రెసిడెన్షియల్ టీచర్ల(సీఆర్టీ)తో పాటు 340 మంది అకాడమిక్ ఇన్స్ట్రక్టర్లు ఔట్సోర్సింగ్, పార్ట్‌టైం ప్రాతిపదికన పనిచేస్తున్నారు. 3 నుంచి 10వ తరగతి వరకు టీచింగ్ చేస్తున్నారు. ఒక్కో ఇన్‌స్ట్రక్టర్‌కు రూ.12వేల వేతనం కాగా, అందులో ఏజెన్సీ, పీఎఫ్, ఈఎస్ఐ చెల్లింపులు పోగా చేతికి అందేది రూ.9వేలే. ప్రభుత్వం 6నెలలుగా నాన్‌టీచింగ్ స్టాఫ్ కామాటి, కుక్, సెక్యూరిటీ గార్డులకు సైతం వేతనాలు చెల్లించడంలేదు. ఇటీవల నిరసన కార్యక్రమాలను చేపట్టినా సర్కారు నుంచి కనీసం స్పందన లేదు. ఎస్సీ గురుకుల సొసైటీ పరిధిలోని గురుకుల పాఠశాలలు, కాలేజీలు, సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌ల్లో 2469 మంది కాంట్రాక్టు, పార్ట్ టైం, ఔట్సోర్సింగ్, సబ్జెక్ట్ అసోసియేట్లుగా పనిచేస్తున్నారు. వారందరికీ 3 నెలలుగా వేతనాలు చెల్లించడం లేదు. జీతాల చెల్లింపుకోసం అధికారులు, ప్రభుత్వానికి వినతిపత్రాలు సమర్పించినా పట్టించుకోవడంలేదన్నారు. పండుగ పూటా పస్తులేనా అంటూ ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.
అమాత్యా ఇదెక్కడి న్యాయం..!
ఎస్టీ, మైనార్టీ గురుకుల సొసైటీల్లో పార్ట్‌టైం, ఔట్సోర్సింగ్, సబ్జెక్ట్ అసోసియేట్లకు సంబంధించిన వేతనాలను సైతం 2నెలలుగా చెల్లించలేదు. వారు రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలను నిర్వహించారు. 15వ తేదీలోగా జీతాలు ఇవ్వకపోతే భవిష్యత్ కార్యాచరణకు దిగుతామని హెచ్చరించారు. దీంతో అప్పటికప్పుడు స్పందించిన ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, దివ్యాంగుల సంక్షేమశాఖల మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ఒక ప్రకటన జారీచేశారు. గురుకుల సొసైటీల్లోని కాంట్రాక్టు, ఔట్ సోర్స్, పార్ట్ టైమ్ సిబ్బందికి సంబంధించిన రెమ్యునరేషన్ బకాయిలను 11.53 కోట్లు, ట్రైబల్ వెల్ఫేర్ సీవోఈల్లోని సబ్జెక్ట్ అసోసియేట్స్ , సీనియర్ ఫ్యాకల్టీ, గేమ్స్ కోచ్‌లకు సంబంధించి రూ. 2.38 కోట్లను విడుదల చేశారు. కానీ ఆశ్రమ పాఠశాలలు, ఎస్సీ గురుకుల సొసైటీల్లోని సిబ్బందికి మాత్రం వేతన బకాయిలను విడుదల చేయకపోవడం గమనార్హం.
5నెలలుగా ఆర్డర్లే లేవు..
గిరిజన సంక్షేమశాఖ పరిధిలోని గురుకుల సొసైటీల్లో పార్ట్‌టైం, ఔట్సోర్సింగ్ సిబ్బందికి సంబంధించి రెన్యువల్ ఆర్డర్స్‌ను ప్రభుత్వం జారీ చేయడంలేదు. ఏటా జూన్ నుంచి ఏప్రిల్ వరకు ఔట్సోర్సింగ్, పార్ట్‌టైమ్ సిబ్బందిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేస్తుంది. మే నెలను మాత్రం మినహాయిస్తున్నది. కాంగ్రెస్ ప్రభుత్వం గిరిజన సొసైటీకి పార్ట్‌టైం, ఔట్సోర్సింగ్ సిబ్బందికి ఈ ఏడాదికి సంబంధించిన కంటిన్యూయేషన్ ఉత్తర్వులను ఇప్పటికీ జారీ చేయలేదు. దీంతో వేతనాలు చెల్లించేందుకు ఆర్థికశాఖ ససేమిరా అంటున్నది. నాలుగు నెలలుగా వేతనాలను నిలిపేసింది. ఈ నేపథ్యంలో వారు రోడ్డెక్కగా తప్పనిసరి పరిస్థితుల్లో 2నెలల బకాయిలను ప్రభుత్వం విడుదల చేసింది. కానీ రెన్యువల్ ఉత్తర్వులను మాత్రం ఇప్పటికీ జారీ చేయలేదు. దీంతో సదరు ఉద్యోగులు సైతం తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
24.59 కోట్ల బకాయిలు ఎప్పుడిస్తరు ; ఎస్సీ గురుకుల సొసైటీ ఉద్యోగుల ఎదురుచూపులు
సాంఘిక సంక్షేమ గురుకుల సొసైటీలోని టీచింగ్, నాన్‌టీచింగ్ సిబ్బందికి గత రెండేండ్లుగా డీఏ బకాయిలను ప్రభుత్వం చెల్లించడంలేదు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులందరికీ డీఏను చెల్లిస్తున్నా సొసైటీ ఉద్యోగులు మాత్రం అందుకు నోచని దుస్థితి. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన డీఏనే కాదు, గత డీఏ బకాయిలనూ వి డుదల చేయని పరిస్థితి. జనవరి 2021 నుంచి జనవరి 2023 వరకు డీఏ 2.73 శాతం.. అందులో 19 నెలలకు సంబంధించి రూ.14,72,47,578ను ప్రభుత్వం బకాయి పెట్టింది. జనవరి 2022- మే 2023 వరకు 2.73 శాతం డీఏ ప్రభుత్వం ప్రకటించింది. అందుకు సంబంధించి 17 నెలలు బకాయిలు రూ.9,87,37,428 పేరుకుపోయాయి. మొత్తంగా పాత బకాయిలే రూ.24,59, 85,006ను ప్రభుత్వం ఇప్పటికీ చెల్లించలేదు.
అవికాకుండా జనవరి 2022 నుంచి అక్టోబర్ 2024 వరకు గల డీఏ బకాయిలను 17 వాయిదాల్లో చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అన్నిశాఖల్లో, గురుకులాల్లో బకాయిలను యథావిధిగా చెల్లిస్తున్నారు. ఎస్సీ గురుకుల సొసైటీలో కేవలం 6 వాయిదాలను చెల్లిం చి ఆ తర్వాత నిలిపేసింది. ఒక డీఏ చెల్లింపునకు సొసైటీకి రూ.1.50కోట్ల చొప్పున ఇవ్వాల్సి ఉన్నది. డీఏ బకాయిలను చెల్లించాలని ప్రభుత్వానికి, సొసైటీ ఉన్నతాధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోవడం లేదని సొసైటీ ఉద్యోగులు వాపోతున్నారు. అంతేగాకుండా వేతనాలు సైతం ఇష్టారీతిన జమచేస్తున్నారని, మొదటి తారీఖున జీతం పడిన దాఖలాలు లేకుండా పోయాయని మండిపడుతున్నారు. సొసైటీలోని ఉన్నతాధికారుల తీరుతోనే ఈ సమస్య ఉత్పన్నమవుతున్నదని ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వెంటనే బకాయిలు చెల్లించాలని, మొదటి తేదీనే వేతనాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.