జ్ఞాపకశక్తి పరీక్షలు నిర్వహించాలన్న ప్రభుత్వ నిర్ణయంపై ఆశ కార్యకర్తలు కన్నెర్ర చేశారు. ఇప్పటికే తీవ్ర పనిఒత్తిడితో సతమతమవుతుండగా.. పరీక్షల పేరిట మానసికంగా వేధించాలని సర్కారు చూస్తున్నదని ఆరోపిస్తూ రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనకు దిగారు. కలెక్టరేట్ల ఎదుట ధర్నా చేపట్టారు. 33 ఏండ్లుగా అనేక శిక్షణలు తీసుకుంటున్న తమను మళ్లీ పరీక్షించే నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
న్యూస్‌నెట్‌వర్క్, జూన్ 13 (నమస్తేతెలంగాణ): ఆశ కార్యకర్తలకు జ్ఞాపకశక్తి పరీక్షలు నిర్వహించాలన్న ప్రభుత్వ నిర్ణయంపై ఆశాలు కన్నెర్ర చేశారు. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ గురువారం రాష్ట్రవ్యాప్తంగా ఆశ వర్కర్లు జిల్లాల కలెక్టరేట్ల వద్ద ధర్నాలు నిర్వహించారు. పొద్దనకా, మాపనకా ప్రజారక్షణే పరమావధిగా విధులు నిర్వహిస్తున్న ఆశ కార్యకర్తల జ్ఞాపకశక్తిని పరీక్షించడానికి పరీక్షలు నిర్వహించాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
ఇందులో భాగంగా ఆశ వర్కర్లు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని ఆయా కలెక్టరేట్ల ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. ఆశ కార్యకర్తలకు జ్ఞాపకశక్తి విధానంతో కొత్తగా ఒరిగేదేమీ లేదని, కార్యకర్తలను తొలగించేందుకే నూతన విధానం అమల్లోకి తెస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఆశ వర్కర్లకు గౌరవ వేతనం నిర్ణయిస్తామని, ఈఎస్ఐ, పీఎఫ్ సౌకర్యం కూడా కల్పిస్తామంటూ హామీ ఇచ్చి అమలు చేయడం లేదని విమర్శించారు.
మహబూబ్‌నగర్, గద్వాల, నాగర్‌కర్నూల్ జిల్లా కలెక్టరేట్ల ఎదుట నిర్వహించిన ధర్నాలో ఆశాలు మాట్లాడుతూ.. పెరిగిన ధరలకనుగుణంగా రూ.18 వేల గౌరవ వేతనం, రూ.50 లక్షల ఇన్సూరెన్స్, రూ.5 లక్షల రిటైర్మెంట్ బెనిఫిట్స్‌తోపాటు జీతంలో సగం పింఛన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆశాల సంక్షేమం కోసం ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలంటూ రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ ఎదుట తెలంగాణ ఆశ వర్కర్స్ యూనియన్ (సీఐటీయూ) ఆధ్వర్యంలో ఆశ వర్కర్లు ధర్నా నిర్వహించారు.
గ్రామీణ ప్రాంతాల్లో ప్రభు త్వ కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహిస్తున్న ఆశాలు జ్ఞాపకశక్తిని నిరూపించుకునేందుకు ప్రభుత్వం ఎగ్జామ్స్ నిర్వహించడం సమంజసం కాదని మండిపడ్డారు. మహబూబాబాద్, ములుగు కలెక్టరేట్ల ఎదుట నిర్వహించిన ధర్నాలో ఆశ వర్కర్లు మాట్లాడుతూ.. 33 సంవత్సరాల నుంచి ఆశాలుగా పనిచేస్తూ అనేక రకాల శిక్షణ తీసుకున్నామని, ఇప్పుడు మళ్లీ పరీక్షలు పెట్టాలనే విధానాన్ని వెంటనే విరమించుకోవాలని డిమాండ్ చేశారు.
కాగా.. ములుగులో డీఎంహెచ్‌వో అప్పయ్య ఆశ వర్కర్ల యూనియన్ లీడర్లను మంత్రి సీతక్క వద్దకు తీసుకెళ్లి వినతిపత్రం అందజేశారు. కాంగ్రెస్ సర్కారుపై ఆశా కార్యకర్తలు కదంతొక్కుతూ ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల కలెక్టరేట్ల ఎదుట సీఐటీయూ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. ‘పారితోషికం మాకొద్దు.. కనీస వేతనం కావాలి’ అంటూ పెద్ద పెట్టున నినాదాలు చేశారు.
గిరిజన ప్రాంతాల్లో 33 ఏండ్లు, మైదాన ప్రాంతాల్లో 19 ఏండ్ల నుంచి పనిచేస్తున్న తమకు.. ప్రతినెలా రూ.26 వేల వేతనం చెల్లించాలని కోరారు. పనిభారం తగ్గించి జాబ్‌కార్డులు ఇవ్వాలని, పీఎఫ్, ఈఎస్ఐ, ఇన్సూరెన్స్ రూ.50 లక్షల సౌకర్యం కల్పించాలని, ప్రతి నెలా 2వ తేదీనే వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. అనంతరం ఆయా జిల్లాల కలెక్టర్లకు వినతిపత్రాలు అందజేశారు.