Rajiv Yuva Vikasam | హైదరాబాద్, మార్చి19 (నమస్తే తెలంగాణ): ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నామని చెప్పిన పథకాలకు సర్కారు అరకొర నిధులే కేటాయించింది. కొన్నింటి ఊసే ఎత్తలేదు. రాజీవ్ వికాసం పథకానికి మాత్రం చెప్పిన విధంగానే రూ.6 వేల కోట్ల నిధులు కేటాయించింది. అయితే ఈ పథకం కింద కార్యకర్తలకే లబ్ధి చేకూర్చాలని ఇప్పటికే సీఎం రేవంత్రెడ్డి స్వయంగా ప్రకటించడం గమనార్హం. రాజీవ్ యువవికాసం పథకం ద్వారా రూ.6 వేల కోట్లను సబ్సిడీ రుణాలుగా అందించనున్నది. చెప్పినట్టుగానే అందుకోసం ప్రస్తుత బడ్జెట్లో సమృద్ధిగా నిధులను సమకూర్చింది. ఎస్సీ కార్పొరేషన్ కింద రూ.2,000 కోట్లు, ఎస్టీ కార్పొరేషన్ కింద రూ.1,360 కోట్లు, బీసీ కార్పొరేషన్ కింద రూ.1,800 కోట్లు, మైనార్టీ కార్పొరేషన్ కింద రూ.840 కోట్లను మొత్తంగా రూ.6,000 కోట్లను పొందుపరిచింది. ఇప్పటికే దరఖాస్తుల స్వీకరణను ప్రారంభించింది. జూన్ 2లోగా లబ్ధిదారులను ఎంపిక చేసి పథకాన్ని వర్తింపజేయనున్నారు.
కాగా, ఈ పథకం ప్రారంభం సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ‘గత ఎన్నికల్లో పార్టీ కోసం రాత్రిబవళ్లు కష్టపడి, చదువుకుని ఖాళీగా ఉంటున్న కాంగ్రెస్ కార్యకర్తల కోసం రూ.6 వేల కోట్లు కేటాయిస్తున్నా. ఈ నిధులను కార్యకర్తల సంక్షేమం, అభివృద్ధి, ఆరోగ్యం, విద్య, భవిష్యత్తు అభివృద్ధి కార్యక్రమాలకు అంకితమిస్తూ ఉపయోగిస్తాం. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు రాజకీయ వ్యూహాలు మాత్రమే కాదు, తమ జీవనోపాధి కోసం కూడా పనిచేస్తున్నారు. పార్టీ కార్యకర్తలకు మాత్రమే కాదు, వారి కుటుంబాలకు కూడా ఆర్థిక భద్రత ఇవ్వడం మా ప్రాధాన్యం. వెంట తిరిగిన కార్యకర్తలకు ఏదైనా చేయాలని అన్ని నియోజకవర్గాల్లోని ఎమ్మెల్యేలు కూడా నన్ను కోరారు. అందుకే కార్యకర్తలకు స్వయం ఉపాధి పథకం కింద రూ.4 లక్షల వరకు అందిస్తాం. రెండు నెలల్లో ఈ డబ్బులు పంపిణీ చేస్తాం. ప్రతీ నియోజకవర్గంలో 4,000 నుంచి 5,000 మందికి డబ్బులు వస్తాయి. అర్హులైన కార్యకర్తలకు అందించే బాధ్యత ఎమ్మెల్యేలదే’ అంటూ వెల్లడించారు.