భద్రాచలం, ఫిబ్రవరి 12 : బహుముఖ ప్రజ్ఞాశాలి అరుణ్‌సాగర్ వర్ధమాన విలేకరులకు స్ఫూర్తిదాయకమని, జర్నలిజంలో పాత, మూస పద్ధతులను బద్దలుకొట్టి, విలక్షణ రీతిలో కథనాలు రాయడం ఆయనకే చెల్లిందని మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ అన్నారు. ఆదివారం భద్రాచలంలో జరిగిన అరుణ్‌సాగర్ పురస్కారాల సభలో ఆయన మాట్లాడుతూ.. అరుణ్‌సాగర్ మిత్రులు గత ఏడేండ్లుగా ఆయన్ని జీవించి ఉంచుతున్నారని తెలిపారు. ఏటా అరుణ్‌సాగర్ పురస్కారాల సభను హైదరాబాద్, విజయవాడలో జరిపేవారని, ఈసారి ఆయన నడయాడిన ఊరిలో పెట్టడంతో ఆయన మళ్లీ జన్మించినట్టు అయిందన్నారు.
ఆంధ్రజ్యోతి సంపాదకుడు కే శ్రీనివాస్, సాక్షి సంపాదకుడు వర్ధెల్లి మురళి మాట్లాడుతూ.. సాగర్‌తో తమకున్న మధుర స్మృతులను గుర్తుచేశారు. అనంతరం అరున్సాగర్ జీవన సాఫల్య పురస్కారాలను సీనియర్ పాత్రికేయులు కే రామచంద్రమూర్తి, ప్రముఖ రచయిత్రి కుప్పిలి పద్మకు అందజేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ గోరటి వెంకన్న, తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరి గౌరీశంకర్, టీఎస్ పీఎస్సీ మాజీ చైర్మన్ ఘంటా చక్రపాణి, ప్రముఖ కవి మువ్వా శ్రీనివాసరావు, డాక్టర్ వాసిరెడ్డి రమేశ్‌బాబు, డాక్టర్ ఉపేంద్రరావు, డాక్టర్ ఎస్ఎల్ కాంతారావు తదితరులు పాల్గొన్నారు.