Arutla Model School | మంచాల, జూన్ 8: కార్పొరేట్ పాఠశాలను తలదన్నే రీతిలో ప్రభుత్వం పాఠశాలను తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. ఈ క్రమంలో మంచాల మండలం ఆరుట్ల ఉన్నత పాఠశాలను మోడల్ స్కూల్‌గా ఎంపిక చేశారు. జిల్లా పరిషత్, ప్రాథమిక, ప్రాథమికోన్నత, ప్రీప్రైమరీ స్కూళ్లు అన్నీ ఒకే ప్రాంగణంలో ఉండటంతో ఈ స్కూల్‌ను మోడల్ స్కూల్‌గా అప్‌గ్రేడ్ చేశారు.
గత ఏడాది డిసెంబర్లో రాష్ట్ర విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి ఆరుట్ల పాఠశాల సందర్శించి, ప్రజల భాగ్యస్వామ్యంతో పాఠశాలను అభివృద్ధి చేస్తానని తల్లిదండ్రులకు వివరించారు. దీనితో పాఠశాల ఆవరణలో విద్యా కమిషన్ చైర్మన్ తోపాటు అధ్యాపకులు, తల్లిదండ్రులు, యువజన సంఘాల సభ్యులు, ప్రజా ప్రతినిధులు. ఉద్యోగస్తులతో ప్రత్యేక కార్యచరణ రూపొందించారు. ఎస్ఎంసీగా రాష్ట్రంలోనే ఆదర్శ పాఠశాలగా గుర్తింపు పొందిన వరంగల్ జిల్లా మామిడి గ్రామంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలకు ఆరుట్ల గ్రామస్థులను తీసుకెళ్లి చూపించారు. అదేవిధంగా రంగారెడ్డి జిల్లా కొంగర రావిరాల్లో ఉన్న ఒక ప్రైవేటు కార్పొరేట్ పాఠశాలను కూడా పరిశీలించారు. దీంతో ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యదర్శి అజిత్ రెడ్డి, విద్యా కమిషన్ చైర్మన్ మురళి తోపాటు కమిటీ సభ్యులు సైతం ఇటీవల ఆరుట్ల పాఠశాలను సందర్శించి ఈ పాఠశాలను పబ్లిక్ స్కూల్‌గా నామకరణ చేసి ప్రత్యేక నిధులు కేటాయించారు.
Akunuri Murali
ఇంగ్లీష్ మీడియానికి ప్రవేశం…
తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటులో భాగంగా ఆరుట్ల పాఠశాలలో ప్రీ ప్రైమరీ స్థాయి నుంచే ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టనున్నారు. డిజిటల్ తరగతులకు గాను గదుల నిర్మాణం పనులు జోరుగా సాగుతున్నాయి. అదేవిధంగా పాఠశాల ఆవరణలో గ్రీనరీ ఏర్పాటు కోసం జీఎంఆర్ సంస్థ ముందుకు వచ్చింది. అదేవిధంగా విశాలమైన క్రీడాస్థలానికి కూడా ఏర్పాటు చేశారు. 26 మందితో స్కూల్ మేనేజ్మెంట్ కమిటీని ఏర్పాటు చేయడంతో వారు గ్రామంలో చోరుగా ప్రచారం నిర్వహించడమే కాకుండా ప్రైవేటు పాఠశాలకు పంపించకుండా తెలంగాణ పబ్లిక్ స్కూల్లో చేర్పిస్తున్నారు. ఇప్పటికే పాఠశాలలో 570 మంది విద్యార్థులు ఉండగా ఈ సంవత్సరం పాఠశాల పునః ప్రారంభంలోపే మరో 400 మంది విద్యార్థులు చేరేందుకు అడ్మిషన్లు కూడా తీసుకుంటున్నారు. మొత్తం మీద తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటుతో చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్న విద్యార్థులు కూడా ఆరుట్ల పబ్లిక్ స్కూల్లో చేరేందుకు చాలామంది క్యూ కడుతున్నారు
పాఠశాలకు ఎస్ డి ఎఫ్ రూ 2 కోట్లు విరాళం
ఆరుట్ల పాఠశాల అభివృద్ధికి సోషల్ డెమొక్రటిక్ ఫోరం సంస్థ విరాళంగా రెండు కోట్ల రూపాయలను ఇచ్చింది. ఈ నిధులతో పాఠశాలలో మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నారు. ఇది గాక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రూ 28 లక్షల రూపాయల నిధులు కేటాయించడంతో ఈ నిధులతో పాఠశాల ఆవరణలో సీసీ రోడ్లు, ప్రహరీ గోడ, లైబ్రరీ, క్రీడ స్థలాన్ని ఏర్పాటు చేస్తున్నారు.