హైదరాబాద్, మే 26 (నమస్తే తెలంగాణ) : సమాజాన్ని చైతన్యవంతం చేసేవిధంగా కళాకారులు సాంస్కృతిక దృష్టి కోణాన్ని మలుచుకొని, కళారూపాలను రూపొందించాలని పలువురు వక్తలు సూచించారు. తెలంగాణ ప్రజా నాట్యమండలి 4వ రాష్ట్ర మహాసభ ప్రతినిధుల సభ మంగళవారం హైదరాబాద్ బషీర్బాగ్ దేశోద్ధారక భవన్లో నిర్వహించారు. మహాసభను సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఈటీ నరసింహ ప్రారంభించగా ప్రొఫెసర్ కోదండరాం ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కోదండరాం మాట్లాడుతూ నాటి కళాకారుల చరిత్ర, త్యాగాలు తెలుసుకుని నేటి యువ కళాకారులు ధైర్యంతో ముందడుగు వేయాలని సూచించారు.
ఈటీ నరసింహ మాట్లాడుతూ మత విద్వేషాలకు వ్యతిరేకంగా ప్రజల్లో లౌకిక భావాలను పెంపొందించే విధంగా సాహిత్యం ఉండాలని తెలిపారు. ప్రజానాట్యమండలి రాష్ట్ర ఉపాధ్యక్షుడు కన్నం లక్ష్మీనారాయణ అధ్యక్షతన జరిగిన సభలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కలవేన శంకర్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎస్.ఛాయాదేవి, ఇండియన్ పీపుల్ థియేటర్ అసోసియేషన్ జాతీయ కౌన్సిల్ సభ్యులు కేస్వామి, తెలంగాణ ప్రజానాట్యమండలి అధ్యక్షులు కే శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి పల్లె నరసింహ, ఉపాధ్యక్షులు చంద్రశేఖర్, కోశాధికారి నళిని, సహాయకార్యదర్శి కొండల్ రావు, తదితరులు పాల్గొన్నారు.