హైదరాబాద్ : వైవిధ్య భరిత కళాత్మక గ్యాలరీలను నిర్వహించడంలో దేశంలోనే ముందంజలో ఉన్నది ఆర్ట్ హౌస్ సంస్థ. చెన్నై, బెంగళూరు కేంద్రంగా పని చేస్తున్న సంస్థ.. సమకాలీన కళలకు సంబంధించి అనేక కోణాలను ఆవిష్కరించే పాన్ ఇండియా మ్యాగజైన్ ఆర్ట్ హౌస్ స్ట్రేటెడ్తో కలిసి తొలిసారిగా సారిగా ట్రావెల్ షోతో పాటు ఎగ్జిబిషన్ నిర్వహిస్తోంది. దేశవ్యాప్తంగా వంద మంది కళాకారుల ప్రతిభను ఒకేచోట చేరుస్తూ ఏఐ-100 పేరుతో గతేడాది ఈ సంస్థ కాఫీ టేబుల్ పుస్తకాన్ని తీసుకొచ్చింది.

ఆ వందమంది కళాకారుల్లో విజయ్ పిచుమణి, దాన్ ప్రసాద్ కూడా ఉన్నారు. ఇటీవలే ఈ పుస్తకాన్ని చెన్నైలో ఆవిష్కరించారు. ఇప్పుడు ఇది హైదరాబాద్ కళాప్రియుల మనసు దోచుకోబోతోంది. శుక్రవారం నుంచి ఈ నెల 9వ తేదీ వరకు జూబ్లీహిల్స్‌లోని స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో ప్రదర్శించనున్నారు. పూర్ణిమ శివరామ్ నేతృత్వంలో కొనసాగనున్నది. గ్యాలరీని ఇవాళ ఉదిత్ దుగర్, ఆర్ట్ హౌస్ సీఎండీ విన్సెంట్ అదైకలరాజ్తో కలిసి ఈ ఎగ్జిబిషన్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఉదిత్ దుగర్ మాట్లాడుతూ ఇలాంటి కళా ప్రదర్శనలను విన్సెంట్ ప్రోత్సహించడం చాలా సంతోషం అనిపించిందన్నారు.

ముఖ్యంగా కరోనా మహమ్మారి తర్వాత ఈ ప్రదర్శనలో ప్రత్యక్షంగా పాల్గొని వీటిని ఆస్వాదించే అవకాశం దక్కిందన్నారు. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాలకు చెందిన కళాకారులు తమ ప్రతిభను ఆవిష్కరించుకోవడానికి ఏఐ-100 ఎంతో దోహదం చేస్తోంది. ఆర్ట్ హౌస్ ఎండీ విన్సెంట్ అదైకలరాజ్ మాట్లాడుతూ వర్ధమాన కళాకారులు, మరీ ముఖ్యంగా దక్షిణాది కళాకారుల ప్రతిభను ప్రోత్సహించే అవకాశం దక్కడం గౌరవంగా భావిస్తున్నానన్నారు. మా ట్రావెల్ షోలో హైదరాబాద్ రెండో మజిలీ అనీ, దేశంవ్యాప్తంగా ఇలాంటి షోలు మరిన్ని నిర్వహిస్తామన్నారు.