ఖైరతాబాద్, జూన్ 18 : ఎన్నికల ముందు రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని ఇచ్చిన హామీని ప్రశ్నించినందుకు నిరుద్యోగులను అరెస్టు చేయడం దుర్మార్గమని డాక్టర్ హరికృష్ణ మండిపడ్డారు. గురువారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ‘తెలంగాణ నిరుద్యోగ సేన’ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. అశోక్‌నగర్ వేదికగా నిరుద్యోగల పక్షాన పోరాడుతున్న వారితో ఆత్మీయ సమ్మేళనం పెట్టుకుంటే పోలీసులు వారిని అక్రమ అరెస్టు చేశారని ఆరోపించారు. ప్రభుత్వం ఇచ్చిన హామీని నిలబెట్టుకోకపోవడం వల్లే విద్యార్థులు, నిరుద్యోగులు సంఘటితమయ్యారని పేర్కొన్నారు. రాష్ట్ర పోలీస్ శాఖలో ఖాళీగా ఉన్న 26వేల పోస్టులను భర్తీ చేయమన్నందుకు అరెస్టు చేయడమేంటని ప్రశ్నించారు. ఇటీవల జరిగిన ఓ సమావేశంలో హిట్లర్ పాలసీని అమలు చేస్తామని చెప్పిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ప్రస్తుతం నిరంకుశ పాలన సాగిస్తున్నారని దుయ్యబట్టారు.
రాహుల్ చెప్పిన ఉద్యోగాలు ఏవి?
2023 అసెంబ్లీ ఎన్నికల ముందు ఏఐసీసీ నేత రాహుల్‌గాంధీ అశోక్‌నగర్‌లోని సిటీ సెంట్రల్ లైబ్రరీ, దిల్సుఖ్నగర్ వచ్చి.. కాంగ్రెస్‌ను గెలిపిస్తే సంవత్సరానికి రెండున్నర లక్షల ఉద్యోగాలిస్తామని చెప్పిన విషయాన్ని గుర్తుచేశారు. వారు చెప్పిన ప్రకారం ఈ రెండున్నరేండ్లలో 5లక్షల ఉద్యోగాలు ఇవ్వాల్సి ఉన్నప్పటికీ, అది పక్కనబెట్టి 60వేల ఉద్యోగాలు ఇచ్చామని గొప్పలు చెప్పుకోవడమేంటని ప్రశ్నించారు. వారు చెబుతున్న ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్లన్నీ బీఆర్ఎస్ హయాంలోనే వచ్చాయని, తాజాగా 16,347 పోలీసుల భర్తీ నోటిఫికేషన్ సైతం గత ప్రభుత్వమే ఇచ్చిందని చెప్పారు. తక్షణమే నిరుద్యోగులపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో తెలంగాణ విఠల్, శివ, జనార్దన్, దామోదర్, ప్రత్యూష, ఆస్మా, ఝాన్సీ, బాలకోటి తదితరులు పాల్గొన్నారు.