హనుమకొండ : ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఐనవోలు శ్రీ మల్లికార్జున స్వామి జాతర ఏర్పాట్లను యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అధికారులను ఆదేశించారు. జాతర ఏర్పాట్లు, భక్తులకు వసతుల కల్పనపై ఐనవోలు దేవస్థానంలో సంబంధిత అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో మాట్లాడారు.
జనవరి 12 నుంచి 18వ తేదీ వరకు జరగనున్న జాతరను విజయవంతం చేయడానికి అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. పనుల కోసం ప్రతిపాదనలు పంపితే నిధుల మంజూరికి చర్యలు తీసుకుంటానని వెల్లడించారు. ‘జాతర నాటికి కరోనా ప్రభావం ఉంటే జాగ్రత్తలతో ముందుకు వెళదాం. ఆరోగ్య శిభిరాలు ఏర్పాటు, పరిశుభ్రత, మంచినీటి వసతి, పార్కింగ్ తదితర ఏర్పాట్లను పకడ్బందీగా చేయాలి. దేవస్థానం ప్రాంతాల్లో హరిత హోటల్ ఏర్పాటుకు తన వంతు కృషి చేస్తా ’నని పేర్కొన్నారు. ఆలయ పరిసరాల్లో రూ. 10 కోట్లతో వివిధ నిర్మాణాలు జరుగుతున్నాయని మంత్రి తెలిపారు.
ఘన చరిత్ర గల ఆలయాన్ని కాపాడేందుకు ప్రతి ఒక్కరు సహకరించాలని కోరారు.జాతరకు వచ్చే చుట్టు పక్కల గ్రామాల్లో, దారుల్లో కూడా పరిసరాలు పరిశుభ్రంగా చేయాలని సూచించారు. అనంతరం మంత్రి, ప్రజా ప్రతినిధులు, అధికారులకు ఆలయ అర్చకులు దర్శనం కల్పించి, వేద ఆశీర్వచనం అందజేశారు.
ఈ సమీక్షా సమావేశంలో ఎమ్మెల్యే అరూరి రమేశ్, కుడా చైర్మన్ సుందర్ రాజ్ యాదవ్, డీసీసీబీ చైర్మన్ మార్నెని రవీందర్ రావు, వరంగల్ పోలీస్ కమిషనర్ రంగనాథ్, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ ప్రావీణ్య, హనుమకొండ కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ సునీత, అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.