హైదరాబాద్, నవంబర్ 9 (నమస్తే తెలంగాణ): తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్టుబోర్డు తరహాలోనే యాదగిరిగుట్ట ఆలయ ట్రస్టుబోర్డు కోసం తగిన ఏర్పాట్లు చేయాలని దేవాదాయ శాఖ ముఖ్యకార్యదర్శి శైలజా రామయ్యర్ ఆ శాఖ కమిషనర్‌కు ఆదేశాలు జారీచేశారు. బోర్డు ఏర్పాటులో ఎటువంటి న్యాయపరమైన ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు న్యాయశాఖతో సంప్రదించడంతోపాటు ఎండోమెంట్ చట్టంలో సవరణలు, సభ్యుల నియామకం తదితర అంశాలతో సమ గ్ర నివేదిక రూపొందించాలని సూచించారు. శుక్రవారం యాదాద్రి పర్యటన సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి టీటీడీ ట్రస్టు బోర్డు తరహాలోనే యాదగిరిగుట్ట ఆలయానికి బోర్డును ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. దీంతో దేవాదాయ శాఖ ఏర్పాట్లు ప్రారంభించింది. బోర్డు ఏర్పాటుకు సంబంధించిన సమగ్ర నివేదికను సీఎంకు సమర్పించి తదుపరి చర్యలు తీసుకోనున్నట్టు అధికారులు తెలిపారు.
ఓపెన్ వర్సిటీ ఉద్యోగుల మౌన దీక్ష
జేఎన్ఏఎఫ్ఏకి భూ కేటాయింపులు వ్యతిరేకిస్తూ వర్సిటీలో కొనసాగుతున్న ఉద్యోగుల నిరసన
హైదరాబాద్, నవంబర్ 9 (నమస్తే తెలంగాణ) : డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో పది ఎకరాల భూమిని జేఎన్ఏఎఫ్ఏకి ఇవ్వాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ శనివారం ఉద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో మౌనదీక్ష నిర్వహించారు. యూనివర్సిటీలోని అంబేద్కర్ విగ్రహం వద్ద నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఇన్చార్జి వీసీ యూనివర్సిటీకి వచ్చి భూ కేటాయింపు సమస్యను పరిష్కరించాలని కోరారు. జేఏసీ కన్వీనర్ శ్రీనివాస్, డాక్టర్ రబీంద్రనాథ్ సోలమన్, జేఏసీ సెక్రటరీ జనరల్ వేణుగోపాల్‌రెడ్డి, ప్రొఫెసర్లు పు ష్పాచక్రవర్తి, చంద్రకళ, ప్రమీల కేతవ త్, శ్రీనివాస్ రజినీకాంత్, రాములు, అవినాష్, కిశోర్, అధ్యాపక, అధ్యాపకేతర, అడ్మినిస్ట్రేటివ్, టెక్నికల్ అసోసియేషన్, టైమ్‌స్కేల్, ఔట్సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగులు, సంఘాల నేతలు పాల్గొని ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.