హైదరాబాద్, జూలై 29(నమస్తే తెలంగాణ) : రైతు రుణమాఫీపై కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతున్నదానికి, క్షేత్రస్థాయిలో అమలవుతున్నదానికి పొంతన లేకుండా పోతున్నది. తొలివిడతకు మించి రెండో విడత రుణమాఫీలో కోతలు పెడుతున్నట్టు తెలుస్తున్నది. అర్హుల సంఖ్యను భారీగా తగ్గించినట్టు స్పష్టమవుతున్నది. లక్షన్నర వరకు రుణాలు మొత్తం రూ.6500 కోట్లు మాఫీ చేస్తుండగా ఈ మేరకు కేవలం 7లక్షల మందికే వర్తించనున్నది. రెండో దశ ఇంత తక్కువ మంది అర్హులు ఉండటంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అసలు అర్హులను ఏ ప్రాతిపదికన ఎంపికచేస్తున్నారనేదానిపై గందరగోళం నెలకొన్నది. రెండో విడతలో భాగంగా ప్రభుత్వం మంగళవారం లక్షన్నర వరకు రుణాలను మాఫీ చేయనున్నది. అసెంబ్లీ ఆవరణలో సీఎం రేవంత్రెడ్డి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. రెండు విడతల్లో కలిపి 18 లక్షల మంది రైతులకే రుణమాఫీ చేయడం కోతలకు అద్దం పడుతున్నది. తొలివిడత రూ. 6,098 కోట్లతో 11.42 లక్షల మంది రైతులకు లక్ష వరకు రుణాలు మాఫీ చేసింది. రెండో విడత రూ.6,500 కోట్లతో 7 లక్షల మందికి లక్షన్నర వరకు రుణాలు మాఫీ చేయనున్నది. రెండు విడతల్లో కలిపి కేవలం 18.42 లక్షల మందికే రుణమాఫీ వర్తిస్తున్నది. రెండు విడతల్లో కలిపి లక్షన్నర వరకు కేవలం 18 లక్షల మంది రైతులే ఉంటారా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ లెక్కను నిశితంగా పరిశీలిస్తే అర్హుల్లో భారీగా కోతలు పెట్టినట్టు తెలుస్తున్నది.
మొత్తం 42 లక్షల మంది రైతులకు రుణమాఫీ చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించింది. ఈ లెక్కన లక్ష, లక్షన్నర వరకు రుణాలున్న 18.42 లక్షల మందికి రుణమాఫీ చేయనుంది. మిగిలినవారిలో లక్షన్నర నుంచి రూ. 2లక్షలకు పైగా రుణం తీసుకున్న రైతులు 23.58 లక్షల మంది ఉండాలి. కానీ అంతమంది ఉంటారా? అని అధికారులే సందేహిస్తున్నారు. మహా అయితే 10 లక్షల మంది ఉంటే ఎక్కువనే అభిప్రాయాలు వ్యక్తంచేస్తున్నారు. ఈ లెక్కన ప్రభుత్వం మొత్తం 28 లక్షల మంది రైతులకే రుణమాఫీ చేస్తున్నదని తేటతెల్లమవుతున్నది.
రుణమాఫీపై ప్రభుత్వం ఆదినుంచీ రహస్య ధోరణిని అవలంబిస్తున్నదనే విమర్శలున్నాయి. అర్హుల సంఖ్యను వెల్లడించడం, జాబితా విడుదల చేయడంలో గోప్యత పాటిస్తున్నది. తొలివిడత ముందు రోజు రాత్రి జాబితా విడుదల చేసిన ప్రభుత్వం రెండో విడత మరీ దారుణంగా సోమవారం రాత్రి వరకూ జాబితాలను జిల్లాలకు అందించలేదు. దీంతో క్షేత్రస్థాయి అధికారుల్లో గందరగోళం నెలకొన్నది. తమకు జాబితా అందకపోవడంతో ఎవరికి రుణమాఫీ అయిందో? ఎవరికి కాలేదో? ఎలా చెప్పాలని అధికారులు వాపోతున్నారు.
గన్నేరువరం, జూలై 29: రైతులందరికీ రుణమాఫీ చేయాల్సిందేనని సీపీఐ నాయకులు డిమాండ్ చేశారు. కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం గునుకుల కొండాపూర్లో రుణమాఫీ కాని రైతులతో బ్యాంకు పాస్ బుక్కులు, రుణపత్రాలు చేతిలో పట్టుకొని సోమవారం నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రైతులందరికీ ఒకేసారి రూ.2 లక్షలు మాఫీ చేస్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి.. ఇప్పుడు విడతల వారీగా కొందరికే చేస్తున్నారని మండిపడ్డారు. రూ.లక్ష లోపు రుణం తీసుకున్నవారికి మాఫీ చేస్తామని చెప్పినా.. అర్హులైన వందలాది మందికి మాఫీ కాలేదని, లిస్టులో పేరు రాలేదని దుయ్యబట్టారు. రుణమాఫీ గురించి ఎవరిని అడగాలో తెలియక రైతులు ఆందోళన చెందుతున్నారని, ఇప్పటికైనా అధికారులు స్పందించి అర్హులను వెంటనే గుర్తించి ప్రభుత్వానికి నివేదిక పంపించాలని డిమాండ్ చేశారు.
రెండో విడతలో భాగంగా మంగళవారం ఉదయం లక్షన్నర వరకు ఉన్న రైతుల రుణాలను మాఫీచేయాలని నిర్ణయించాం. సీఎం రేవంత్రెడ్డి నిధులు విడుదల చేస్తారు. రుణమాఫీపై సందేహాలున్న రైతులు ఏఈవోలను, బ్యాంకర్లను సంప్రదించి నివృత్తి చేసుకోవాలి.