హైదరాబాద్/కరీంనగర్, అక్టోబర్ 29 (నమస్తే తెలంగాణ): హుజూరాబాద్ అసెంబ్లీ స్థానానికి శనివారం నిర్వహించే ఉప ఎన్నిక కోసం అధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు. కొవిడ్ నేపథ్యంలో ఎన్నికల కమిషన్ పోలింగ్‌కు రెండు గంటల అదనపు సమయం ఇచ్చింది. శనివారం ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమై సాయంత్రం 7 గంటలకు ముగుస్తుంది. శుక్రవారం హుజూరాబాద్‌లోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటుచేసిన డిస్ట్రిబ్యూషన్ సెంటర్ నుంచి సిబ్బంది ఈవీఎంలు, వీవీప్యాట్స్‌తో తమకు కేటాయించిన పోలింగ్ కేంద్రాలకు తరలి వెళ్లారు.
పటిష్టంగా కొవిడ్ నిబంధనలు
కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా పోలింగ్ కేంద్రాలన్నింటినీ శాటిటైజ్ చేశారు. ఓటు వేసేందుకు వచ్చే ప్రతి వ్యక్తి శరీర ఉష్ణోగ్రతను ఏఎన్ఎం, ఆశా వర్కర్లు పరీక్షిస్తారు. మాస్కులు లేకుంటే అందజేస్తారు. ఈవీఎంపై ఓటు మీటను నొక్కే కుడి చేతికి గ్లౌజ్ కూడా ఇస్తారు. కొవిడ్ రోగులు ఓటువేసేందుకు ప్రత్యేక సమయాన్ని కేటాయించారు. వారికి పీపీఈ కిట్స్ అందుబాటులో ఉంచారు. ఓటర్ కార్డు లేనివారు 11 రకాల కార్డుల్లో ఏదో ఒకటి చూపించి ఓటు వేయొచ్చని అధికారులు తెలిపారు. అన్ని కేంద్రాల నుంచి వెబ్‌కాస్టింగ్ ప్రసారాలు సాగుతాయి. ఓటింగ్ ముగిసిన తర్వాత కరీంనగర్‌లోని ఎస్ఆర్ఆర్ కళాశాల స్ట్రాంగ్ రూంలో ఈవీఎంలను భద్రపరుస్తారు. నవంబర్ 2న ఇక్కడే ఓట్ల లెక్కింపు జరుగుతుంది.
అందరూ ఓటేయండి: శశాంక్
నియోజకవర్గంలోని ఓటర్లంతా ఉప ఎన్నికలో ఓటుహక్కును వినియోగించుకోవాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి శశాంక్ గోయల్ పిలుపునిచ్చారు. ఓటర్లు కరోనా నిబంధనలు పాటిస్తూ ఓటు వేయాలని విజ్ఞప్తిచేశారు. 32 మంది మైక్రో పరిశీలకులను నియమించామని చెప్పారు. ఎన్నికల ప్రచారం సందర్భంగా పార్టీల నుంచి అనేక ఫిర్యాదులు వచ్చాయని, వాటన్నింటిపై చర్యలు తీసుకొంటున్నట్టు వెల్లడించారు. ఇప్పటివరకు వివిధ ప్రాంతాల్లో రూ.3.50 కోట్ల నగదును పట్టుకున్నామని తెలిపారు. ఇక్కడ 2018 ఎన్నికల్లో 84.5 శాతం ఓటింగ్ జరిగిందని, ఈసారి మరింత పెంచేందుకు ప్రయత్నిస్తున్నట్టు వెల్లడించారు. వెబ్ కాస్టింగ్ ద్వారా హైదరాబాద్ సీఈఓ కార్యాలయం నుంచి కరీంనగర్, హన్మకొండ జిల్లా కేంద్రాల నుంచి కూడా నిత్య పర్యవేక్షణ ఉంటుందని చెప్పారు.