అబిడ్స్, జూన్ 4: అస్తమా వ్యాధిగ్రస్తులకు వర ప్రదాయినిగా నిలిచిన బత్తిని సోదరుల చేప ప్రసాదం పంపిణీకి అధికారులు ఏర్పాట్లను ప్రారంభించారు. చేప ప్రసాదం పంపిణీని పకడ్బందీగా నిర్వహించేందుకు సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో సమీక్షా సమావేశాన్ని నిర్వహించి ఏర్పాట్లను పకడ్బందీగా చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఈ మేరకు చేప ప్రసాదాన్ని స్వీకరించేందుకు వచ్చే అస్తమా వ్యాధిగ్రస్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆర్అండ్బీ అధికారులు షెడ్ల నిర్మాణం, బ్యారికేడ్ల ఏర్పాటుకు చర్యలు ప్రారంభించారు. నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో కౌంటర్లను ఏర్పాటు చేసి ఆయా కౌంటర్ల ద్వారా చేప ప్రసాదం పంపిణీ చేయనున్నారు.