Vemula Prashanth Reddy | కేసీఆర్ పాలన పదేండ్ల సంక్షేమం అయితే.. రేవంత్ రెడ్డి పాలన 17 నెలల విధ్వంసం అని మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి విమర్శించారు. నిజామాబాద్ జిల్లా పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్‌తో కలిసి ఆయన మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పుట్టింది తెలంగాణ ప్రజల కోసమే అని అన్నారు. 15 ఏండ్ల సుదీర్ఘ పోరాటం తర్వాత ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించి తెలంగాణ ప్రజలకు విముక్తి కలిగించిందని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత పదేండ్ల పాలనలో తెలంగాణను దేశంలోనే నంబర్‌వన్‌గా కేసీఆర్ నిలబెట్టారని చెప్పారు. కానీ రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన 17 నెలల్లోనే తెలంగాణను విధ్వంసం చేశారని మండిపడ్డారు.
కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తలసరి ఆదాయంలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే నంబర్‌వన్‌గా ఉండేదని వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. కానీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక 11వ స్థానానికి పడిపోయిందని తెలిపారు. జీఎస్డీపీలో మూడో స్థానంలో ఉన్న తెలంగాణ.. 14వ స్థానానికి పడిపోయిందని చెప్పారు. ఈ లెక్కలే రేవంత్ రెడ్డి చేసిన విధ్వంసానికి నిదర్శనమని అన్నారు. అనేక మాయమాటలు, మోసపూరిత హామీలు ఇచ్చి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని, రేవంత్ రెడ్డి మాటలు విని తెలంగాణ ప్రజలు మోసపోయారు అని ఎమ్మెల్యే అన్నారు. ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా సక్రమంగా అమలు చేయకుండా అన్ని వర్గాలను మోసం చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది అని విమర్శించారు.
రైతులకు సంపూర్ణ రుణమాఫీ జరగలేదు, రైతుబంధు లేదు, ప్రతి ఆడబిడ్డకు 2500, రూ.4వేలకు పెన్షన్ పెంపు, విద్యా భరోసా, నిరుద్యోగ భృతి , 500 బోనస్ ఇలా ఏ ఒక్క హామీ అమలు కావడం లేదరని అన్నారు. తులం బంగారం అడిగినందుకు బాల్కొండ నియోజకవర్గంలో మా కార్యకర్తలపై లాఠీ చార్జీ చేసి 33 మందిపై అక్రమ కేసులు పెట్టారని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రజల సంక్షేమాన్ని గాలికి వదిలేసి దోచుకోవడమే పనిగా పెట్టుకున్నారని మండిపడ్డారు. భూకబ్జాలు, కాంట్రాక్టుల దగ్గర కమీషన్లు తీసుకోనిదే బిల్లులు మంజూరు చేయడం లేదని విమర్శించారు.
వరంగల్ సభకు వేలాదిగా తరలివచ్చి విజయవంతం చేయాలని, కేసీఆర్‌ను ఆశీర్వదించాలని పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ రజతోత్సవ సభకు వరంగల్‌లో బ్రహ్మాండంగా ఏర్పాట్లు జరిగాయని తెలిపారు. న భూతో న భవిష్యత్ అన్న విధంగా వరంగల్ సభ జరగబోతుందని చెప్పారు. రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలను అమలు చేయమని లక్షలాది మంది ప్రజల మధ్యలో నుంచి డిమాండ్ చేయడానికే వరంగల్ సభ అని స్పష్టం చేశారు.
వరంగల్ సభకు వెళ్లేందుకు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి 2400 వాహనాలను సిద్ధంగా ఉంచామని వేముల ప్రశాంత్ రెడ్డి తెలిపారు. 250 ఆర్టీసీ బస్సులు, 264 ప్రైవేటు బస్సులు, తుఫాన్ ట్యాక్సీలు 626, కార్లు 1266 ఇలా మొత్తంగా 2400 వాహనాల్లో 40 వేల మంది సభకు తరలి రానున్నారని చెప్పారు. ఈ సభ కోసం మహారాష్ట్ర, కర్ణాటక నుంచి వాహనాలను తెప్పించామని పేర్కొన్నారు. నిజామాబాద్ ఉమ్మడి జిల్లా నుంచి ప్రజలు స్వచ్ఛందంగా తరలిరావడానికి ఎంతో మంది ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ఉమ్మడి జిల్లా అధ్యక్షులు జీవన్ రెడ్డి, ముజీబ్, ఎమ్మెల్సీ కవిత, ఎంపీ సురేశ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్ధన్, గణేశ్ గుప్తా, గంప గోవర్ధన్, షకీల్, సురేందర్, హన్మంత్ షిండే అందరం సభ విజయవంతానికి సమన్వయంతో పని చేస్తున్నాం అన్నారు. వరంగల్ సభ తెలంగాణ ప్రజల ఆకాంక్షను నిలబెడుతుంది కావున వేలాదిగా తరలివచ్చి కేసీఆర్ ను ఆశీర్వదించాలని జిల్లా ప్రజలను ఎమ్మెల్యే కోరారు.