సాధారణ ప్రసవాలకు ప్రత్యేక ప్రోత్సాహకాలు
కుక, పాముకాటు మందులు తప్పనిసరి
అత్యవసర సేవలు 24 గంటలూ అందాలి
పీహెచ్‌సీల పనితీరుపై మంత్రి హరీశ్ సమీక్ష
హైదరాబాద్, ఏప్రిల్ 5 : ఆరోగ్యశ్రీ సేవలను ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల (పీహెచ్సీ) స్థాయికి విస్తరింపజేయాలని నిర్ణయించినట్టు వైద్యారోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు తెలిపారు. ఇందుకు అనుగుణంగా పీహెచ్‌సీలు ఆరోగ్యశ్రీ ట్రస్ట్‌లో ఎన్రోల్ చేసుకోవాలని అధికారులకు సూచించారు. పీహెచ్సీ భవనాలకు మరమ్మతులు, కొత్త భవనాల నిర్మాణం కోసం ప్రతిపాదనలు పంపించాలని ఆదేశించారు. మంగళవారం ఆయన పీహెచ్‌సీల పనితీరుపై అన్ని జిల్లాల డీఎంహెచ్వోలు, ప్రోగ్రాం ఆఫీసర్లు, మెడికల్ ఆఫీసర్లు, సూపర్వైజరీ సిబ్బందితో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ.. సాధారణ ప్రసవాలు పెంచాలనే లక్ష్యంలో భాగంగా వైద్యులకు, నర్సులకు ప్రోత్సహకాలు (ఇన్సెంటివ్స్) ఇస్తామని తెలిపారు.
పీహెచ్‌సీల్లో అవసరమైన అన్ని రకాల మందులతో పాటు పాము, కుకకాటు మందులు తప్పనిసరిగా ఉంచాలని ఆదేశించారు. మందులు లేవనే పరిస్థితి ఉండొద్దని, మందుల కోసం బయటికి రాస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. సిబ్బంది ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు విధుల్లో ఉండాలని స్పష్టంచేశారు. 24 గంటల పీహెచ్‌సీలు అత్యవసర సేవలను అన్నివేళల్లోనూ అందించాలని ఆదేశించారు. బడ్జెట్లో ఆరోగ్యశాఖకు కేటాయింపులు 78 శాతం పెరిగాయని, నూతనోత్సాహంతో పని చేసి ముఖ్యమంత్రి కేసీఆర్ కల ఆరోగ్య తెలంగాణను సాకారం చేయాలని పిలుపునిచ్చారు. వ్యాధిని ప్రాథమిక స్థాయిలో గుర్తించి, చికిత్స అందిస్తే రోగులకు పెద్ద దవాఖానల చుట్టూ తిరగాల్సిన అవస్థ తప్పుతుందని పేర్కొన్నారు. బాగా పనిచేసేవారికి ప్రత్యేక గుర్తింపు ఉంటుందని, ఉత్తమ వైద్య, ఆరోగ్యసేవలు అందించినవారిని ఈ నెల 7న సన్మానిస్తామని తెలిపారు. కార్యక్రమంలో ఆరోగ్యశాఖ కార్యదర్శి రిజ్వీ, ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్ వాకాటి కరుణ, డీపీహెచ్ శ్రీనివాసరావు, డీఎంఈ రమేశ్‌రెడ్డి, సీఎంఓఎస్డీ గంగాధర్, టీఎస్ఎంఎస్ఐడీసీ ఎండీ చంద్రశేఖర్‌రెడ్డి, టీవీవీపీ కమిషనర్ అజయ్ కుమార్ పాల్గొన్నారు.