మెదక్ అర్బన్, జూన్ 7: ఆర్మీ ఉద్యోగి అనుమానాస్పదస్థితిలో మృతిచెందాడు. భార్య, అత్తామామలు దాడి చేయడం వల్లే మరణించినట్టు అనుమానిస్తున్నారు. ఈ ఘటన మెదక్ జిల్లా కేంద్రంలో శనివారం రాత్రి చోటుచేసుకున్నది. మెదక్ టౌన్ పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. మెదక్ మండలం ర్యాలమడుగుకు చెందిన ఆర్మీ ఉద్యోగి పొన్నం కుమార్‌గౌడ్ (45) మెదక్ పట్టణంలోని మిలిటరీ కాలనీలో కుటుంబ సభ్యులతో కలిసి నివాసం ఉంటున్నాడు. ఇతను ఉత్తరాఖండ్‌లో పని చేస్తున్నాడు. సెలవు పెట్టి ఇటీవల మెదక్ వచ్చాడు. ఇతడికి భార్య పద్మ, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. అయితే శనివారం రాత్రి కుమార్‌గౌడ్ తన ఇంట్లో హత్యకు గురైనట్టు సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని, మృతదేహాన్ని ప్రభుత్వ దవాఖానకు తరలించారు. భార్యతోపాటు అత్తామామ, బావమరిది కట్టెలతో దాడి చేయడం వల్లే కుమార్‌గౌడ్ మరణించి ఉంటాడని అనుమానిస్తున్నట్టు పోలీసులు పేర్కొన్నారు. మృతుడి అన్న రవీందర్‌గౌడ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, భార్య పద్మతోపాటు అత్తామామను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్టు టౌన్ సీఐ మహేశ్ తెలిపారు.