నిజామాబాద్, మార్చి 24 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): దేశంలో బీజేపీ రౌడీయిజం పేట్రేగిపోతుంటే.. రాష్ట్రంలో మాత్రం కేసీఆర్ ఇజం కనిపిస్తున్నదని ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి పేర్కొన్నారు. కేసీఆర్ ఇజం అంటే రాష్ట్ర సంపద పెంచడం, పేదలకు పంచడం అని అభివర్ణించారు. బీజేపీ పాలనలో దేశ సంపదను దోచుకుని గుజరాత్ బడాబాబులకు పంచిపెట్టడంతోనే సరిపోతుందని ధ్వజమెత్తారు. నిజామాబాద్ ప్రెస్‌క్లబ్‌లో ఎమ్మెల్యే బిగాల గణేశ్‌గుప్తా, జడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠల్ రావుతో కలిసి గురువారం మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ప్రజాసంక్షేమానికి టీఆర్ఎస్ ప్రభుత్వం రూ.3.50 లక్షల కోట్లు ఖర్చు చేసిందని తెలిపారు. దేశాన్ని సాదే నాలుగు రాష్ర్టాల్లో తెలంగాణ ఒకటిగా నిలిచిందని స్పష్టంచేశారు. ప్రధాని మోదీ సామాన్యులపై అడ్డదిడ్డంగా పన్నులు వేసి రూ.23 లక్షల కోట్లు దోచుకున్నాడని విమర్శించారు. బ్యాంకులను, దేశాన్ని ముంచేటోళ్లను మోదీ కాపాడుతున్నాడని దుయ్యబట్టారు. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఇంత ఘోరమైన ప్రభుత్వం చూడలేదని ఎద్దేవాచేశారు. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ ఫేక్ అండ్ ఫ్రాడ్ ఫాల్స్ ఎంపీ అంటూ వ్యాఖ్యానించారు. బాండ్ పేపర్ రాసిచ్చి వెనక్కి తిరిగిన ఎంపీ దేశంలోనే ఎవరూ లేరన్నారు. అర్వింద్‌కు దమ్ముంటే తెలంగాణ వడ్లు కొనేలా కేంద్రాన్ని ఒప్పించాలని సవాల్ విసిరారు. పిచ్చి ప్రేలాపనలు, దొంగ లెక్కలు మానుకొని దమ్ముంటే అర్వింద్ నేరుగా చేసిన అభివృద్ధిపై చర్చకు రావాలని డిమాండ్‌చేశారు. పంజాబ్‌లో బీజేపీకి జీరో ఎంపీలున్నారని అందుకే అక్కడ వడ్లను వందకు వందశాతం కొంటున్నారని.. రాష్ట్రంలోనూ బీజేపీని జీరో చేస్తేనే కేంద్రంలోని మోదీ సర్కార్‌కు బుద్ధి వస్తుందని చెప్పారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగ నోటిఫికేషన్లు వేయడంతో కాంగ్రెస్, బీజేపీకి నిద్ర పట్టడం లేదని చురకలంటించారు.