అలంపూర్, జూన్ 22 : జోగుళాంబ గద్వాల జిల్లా రాజోళి మండలం తుమ్మిళ్ల ఇసుక రీచ్ వద్ద ఆంధ్రానేతలు బీభత్సం సృష్టించారు. తుమ్మిళ్ల ఇసుక రీచ్ నుంచి ఆంధ్రాప్రాంతానికి చెందిన కొందరు వ్యక్తులు ఇసుక తరలించేందుకు టీజీ ఎండీసీ నుంచి అనుమతులు పొందారు. సోమవారం గుంటూరు జిల్లాకు చెందిన టీడీపీ నాయకుడు ఆడుసుమిల్లి శ్రీధర్ వర్గీయులు రెండు కార్లలో వచ్చి రీచ్ దగ్గర విధులు నిర్వహిస్తున్న సిబ్బందిపై మారణాయుధాలతో దాడి చేయడమే కాకుండా రికార్డు బుక్కులు, నగదు ఎత్తుకెళ్లారు. ఈ దాడిలో హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌కు చెందిన గుత్తికొండ ఠాగూర్ హస్తం ఉందని సైట్ ఇన్చార్జి ఎల్వీ చౌదరి తెలిపారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు వెల్లడించారు.
ఒకే ప్రాంతానికి చెందిన రెండు వర్గాలకు చెందినవారు ఒకప్పుడు కలిసే వ్యాపారం చేసుకొనేవారని, వారిద్దరి మధ్య కొంతకాలంగా భేదాభిప్రాయాల వచ్చి విడిపోయి ఒకరిపై మరొకరు ఆరోపణలు, దాడులు చేసుకుంటున్నారని విశ్వనీయ సమాచారం. ఈ దాడుల వెనుక తెలంగాణ ప్రాంతానికి చెందిన రాజకీయనాయకుల ప్రమేయం ఉందని ఆరోపణలు వినిపిస్తున్నాయి.