నాంపల్లి కోర్టులు, జూలై 3 (నమస్తే తెలంగాణ): టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో ఇటీవల అరెస్టయిన దొడ్డ శివారెడ్డి బెయిల్ పిటిషన్‌పై సోమవారం వాదనలు పూర్తయ్యాయి. కోచింగ్ సెంటర్ నడిపిస్తున్న సమయంలో పూల రమేశ్ తన సెంటర్‌కు వచ్చాడని, ప్రశ్నలకు జవాబులు అందించాడని నిందితుడి తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. రూ.2 లక్షలు శివారెడ్డికి ఇచ్చినట్టు కేసులో నమోదు చేశారని పేర్కొన్నారు. నిందితుడి భార్యకు ఈ విషయాలేవీ తెలియవని, షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేయాలని కోరారు. సిట్ పీపీ క్రిష్ణయ్య అభ్యంతరాలు వ్యక్తం చేశారు.
నిందితుడు అందించిన జవాబులను చాట్ జీపీటీ ద్వారా ఇతరులకు పంపించారని కోర్టుకు వివరించారు. ప్రశ్నలన్నీంటికీ జవాబులను అందించినట్టు పీపీ తెలిపారు. ఇదే మాదిరిగా బీహార్‌లో కూడా ఓ ఘటన జరిగిందని పీపీ వివరించారు.బెయిల్ మంజూరు చేయరాదని, విచారణ కొనసాగుతున్నదని పేర్కొన్నారు. మరో నిందితుడు మహ్మద్ ఖాలీద్ తరఫున వేసిన పిటిషన్‌కు పీపీ కౌంటర్ దాఖలు చేశారు. వాదనల కోసం మంగళవారానికి వాయిదా వేసింది. ఓ కళాశాలకు ప్రిన్సిపాల్‌గా వ్యవహరిస్తున్న సయ్యద్ మహబూబ్‌కు ఐదు రోజుల కస్టడీ ముగిసింది. జ్యుడీషియల్ కస్టడీకి తరలిస్తూ 12వ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ జీ ఈశ్వరయ్య ఆదేశాలు జారీ చేశారు. సిట్ అధికారులు నిందితుడిని చంచల్‌గూడ జైలుకు తరలించారు.