హైదరాబాద్, ఫిబ్రవరి 7 (నమస్తే తెలంగాణ) : ఫోన్ల ట్యాపింగ్ కేసులో ముందస్తు బెయిలు కోసం ‘ఐన్యూస్’ ఎండీ శ్రవణ్ కుమార్ దాఖలు చేసుకున్న పిటిషన్‌పై శుక్రవారం హైకోర్టులో వాదనలు పూర్తయ్యాయి. శ్రవణ్ కుమార్ ప్రస్తుతం విదేశంలో ఉన్నప్పటికీ తనకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని పోలీసులకు అందజేయడంతోపాటు చిరునామా, ఫోన్ నంబర్లు తదితర వివరాలను పబ్లిక్ డొమైన్లో ఉంచారని ఆయన తరఫు న్యాయవాది చెప్పారు. కేసు దర్యాప్తునకు సహకరించేందుకు శ్రవణ్ కుమార్ సిద్ధంగా ఉన్నారని..ఆయనకు బెయిల్ ఇవ్వాలని కోరారు. దీనిపై పబ్లిక్ ప్రాసిక్యూటర్ పల్లె నాగేశ్వర్రావు అభ్యంతరం వ్యక్తం చేశారు. న్యాయమూర్తుల ఫోన్లు సైతం ట్యాపింగ్‌కు గురయ్యాయని, శ్రవణ్ కుమార్‌కు బెయిల్ ఇవ్వొద్దని విజ్ఞప్తి చేశారు. ఇరుపక్షాల వాదనలు పూర్తవడంతో తీర్పును తర్వాత వెలువరిస్తామని జస్టిస్ కే సుజన ప్రకటించారు.