కూసుమంచి, జూలై 14: కుటుంబ కలహాలు, భార్యతో గొడవ పడిన ఓ ఆటో డ్రైవర్ ఆత్మహత్యకు యత్నించాడు. క్షణికావేశంలో అభం శుభం తెలియని రెండేండ్ల కుమార్తెను పాలేరులో పడేసి తానూ ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుని జలాశయం వద్దకు చేరుకున్నాడు. చిన్నారిని జలాశయంలోకి విసిరేసే సమయంలో అక్కడికి వచ్చిన బ్లూకోల్ట్ కానిస్టేబుల్.. అతడి ప్రయత్నాన్ని అడ్డగించి పాపను చేతుల్లోకి తీసుకుని వారి ప్రాణాలు కాపాడాడు.
ఈ ఘటన ఆదివారం ఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలో జరిగింది. కూసుమంచి మండలం జీళ్లచెరువు గ్రామానికి చెందిన జంపాల నరేశ్ ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. కుటుంబ సమస్యలతోపాటు భార్యతో గొడవపడి మనస్తాపం చెందాడు. క్షణికావేశానికి లోనై అదే మండలంలో ఉన్న పాలేరు జలాశయంలో దూకి ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు.
తన రెండేండ్ల కుమార్తెను తీసుకొని పాలేరు రిజర్వాయర్ వద్దకు చేరుకున్నాక 100కు ఫోన్ చేశాడు. తన కుమార్తెను పాలేరులో పడేసి తాను కూడా ఆత్మహత్య చేసుకుంటున్నట్టు చెప్పి ఫోన్ కట్ చేశాడు. వెంటనే తన కుమార్తె అంగీకి రాళ్లు కట్టి ఆమెను జలాశయంలో పడేసేందుకు ప్రయత్నిస్తున్నాడు. అప్పటికే సమచారం అందుకున్న కూసుమంచి బ్లూకోల్ట్ కానిస్టేబుల్ బ్రహ్మం.. క్షణాల్లో అక్కడికి చేరుకున్నాడు.
పాపను జలాశయంలోకి విసురుతుండగా తన చేతుల్లోకి తీసుకున్నాడు. నరేశ్‌ను కూడా పక్కకు తీసుకొచ్చాడు. పోలీస్‌స్టేషన్‌కు తీసుకొచ్చి నరేశ్‌కు కౌన్సెలింగ్ ఇచ్చారు. చిన్నారిని అతడి కుటుంబ సభ్యులకు అప్పగించారు. క్షణాల్లో స్పందించి మెరుపువేగంతో వెళ్లి ఇద్దరిని కాపాడిన బ్లూకోల్ట్ కానిస్టేబుల్ బ్రహ్మంను పోలీసులు, మండల ప్రజలు అభినందించారు.