హైదరాబాద్, నవంబర్ 14 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వం తీరుతో దళిత, బడుగు, బలహీన, మైనారిటీ వర్గాల విద్యార్థులకు విదేశీ విద్య అందని ద్రాక్షగానే మిగిలిపోతున్నది. ఓవర్సీస్ స్కాలర్షిప్ స్కీమ్ అటకెక్కుతున్నది. ప్రభుత్వం నిధుల విడుదలలో గ్యారెంటీ ఇవ్వకపోవడంతో విద్యార్థులు దరఖాస్తుకు ఆసక్తి చూపడంలేదు. బీసీ ఓవర్సీస్ స్కీమ్‌కు స్ప్రింగ్ సీజన్లో వచ్చిన దరఖాస్తులే నిదర్శనంగా నిలుస్తున్నాయి. ఎన్నడూ లేనివిధంగా కనిష్ఠంగా 248 దరఖాస్తులు రావడం పరిస్థితికి అద్దం పడుతున్నది. సీఎం ఓవర్సీస్, అంబేద్కర్ ఓవర్సీస్ స్కీమ్‌లకూ స్పందన లేదు. అమెరికా, ఇతర దేశాలు వీసాలపై విధిస్తున్న ఆంక్షలూ ప్రభావం చూపుతున్నాయి.
నాడు పోటీ.. నేడు అనాసక్తి
పేదింటి బిడ్డలు విదేశాల్లో పీజీ, పీహెచ్డీ కోర్సులు చదువుకోవడానికి బీఆర్ఎస్ ప్రభుత్వం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు, ఈబీసీలకు విదేశీ విద్యానిధి పథకాలను ప్రవేశపెట్టింది. పూలే విద్యానిధి పథకంలో భాగంగా ఏటా జనవరిలో (స్ప్రింగ్ సీజన్) 150 మంది, ఆగస్టులో (ఫాల్ సీజన్)కు 150 మంది విద్యార్థులను ఎంపిక చేసి, ఒక్కొక్కరికి రూ.20 లక్షల చొప్పున ఆర్థికసాయం అందించింది. వీసా చార్జీలు, ప్రయాణ ఖర్చు లను భరించింది. 30 సీట్లను ఈబీసీల కు కేటాయించింది. 2023 ఫాల్ సీజన్‌కు 2,665 మంది, స్ప్రింగ్ సీజన్‌కు 1,119 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇదీ గతంలో బీసీ ఓవర్సీస్ స్కీమ్‌కు నెలకొన్న పోటీ. కానీ ప్రస్తుతం దరఖాస్తు చేసుకోవడానికి విద్యార్థులు ఆసక్తి చూపడంలేదు.
నిధులు ఇస్తరో.. ఇయ్యరో తెలియక!
విదేశీ విద్యానిధి పథకాలకు విద్యార్థులు ఆసక్తి చూపకపోవడానికి రాష్ట్ర ప్రభుత్వ తీరే ప్రధాన కారణమని వివిధ సామాజిక వర్గాల సంఘాల నేతలు చెప్తున్నారు. ప్రభుత్వం ఎప్పుడు నిధులు విడుదల చేస్తుందో, అసలు విడుదల చేస్తుందో లేదో తెలియని దుస్థితి నెలకొన్నదని వాపోతున్నారు. ఇప్పటికే ప్రభుత్వం చాలామంది విద్యార్థుల కు బకాయిలు చెల్లించలేద ని గుర్తుచేస్తున్నారు. అప్పు చేసి మరీ విదేశాల్లో చదువు కోసం వెళ్లిన వాళ్లు ఇబ్బందుల్లో ఉన్నారని చెప్తున్నారు. విద్యార్థులు, తల్లిదండ్రులు మానసిక వేదనకు గురవుతున్నారని తెలిపారు. ఎవరు బకాయిలు అడిగినా ప్రభుత్వం దివాలా తీసిందంటూ సీఎం రేవంత్‌రెడ్డి చేతులెత్తేస్తున్న నేపథ్యంలో ప్రభుత్వాన్ని నమ్ముకుంటే విదేశీ విద్య మిథ్యగానే మిగులుతుందని విద్యార్థులు రాజీ పడుతున్నారు. స్థానికంగానే ఆర్థిక స్థోమతకు తగిన కోర్సుల్లోనే జాయిన్ అవుతున్నారని విద్యార్థి సంఘాల నేతలు చెప్తున్నారు. దీంతో పేదలు కూడా విదేశాల్లో మెరుగైన విద్య అభ్యసించాలన్న గత ప్రభుత్వ ఆశయం నీరుగారిపోతున్నదని వాపోతున్నారు.