మియాపూర్, మార్చి 19 : చెరువుల సుందరీకరణ, పరిరక్షణపై హైడ్రాకు చిత్తశుద్ధి లోపించిందని పీఏసీ చైర్మన్, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరికపూడి గాంధీ విమర్శలు గుప్పించారు. మియాపూర్‌లోని పటేల్‌కుంట చెరువు సుందరీకరణ పనులను ప్రారంభింంచిన తర్వాత సమావేశంలో అరికెపూడి గాంధీ మాట్లాడుతూ చెరువుల పరిరక్షణ కోసం హైడ్రా సెక్యూరిటీ సిబ్బంది సమక్షంలోనే గంగారం చెరువులోని ఐదు ఎకరాల స్థలంలో అక్రమార్కులు మట్టి నింపారని మండిపడ్డారు. ఈ తతంగం చూస్తుంటే కబ్జాదారులకు హైడ్రా సిబ్బంది సహకరిస్తున్నట్టు అనుమానం కలుగుతున్నదని ఆరోపించారు. స్థలాల ఆక్రమణకు సహకరిస్తుండడం చూస్తుంటే చెరువుల పరిరక్షణపై హైడ్రాకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉందో అర్థమవుతున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు. చెరువుల పరిరక్షణకు చర్యలు తీసుకుంటామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ చెబుతుంటే, ఆ విభాగం సిబ్బంది చెరువు స్థలాలను అన్యాక్రాంతమయ్యేలా వ్యవహరించం సరికాదని మండిపడ్డారు.
హైడ్రా వ్యవహారం వివాదాస్పదమవుతున్నది. ఇటీవలే కాంగ్రెస్ పార్టీకి చెందిన జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి హైడ్రాపై తీవ్ర ఆరోపణలు చేశారు. నోటీసుల పేరుతో హైడ్రా దందా చేస్తున్నదని సంచలన ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలోనే క్యాబినెట్ హోదాలో ఉన్న పీఏసీ చైర్మన్ అరికెపూడి గాంధీ హైడ్రా తీరును తప్పుబట్టారు. రాజకీయాల కోసం తాను మాట్లాడటంలేదని, పూర్తిస్థాయి సమాచారంతోనే వివరాలు వెల్లడిస్తున్నట్టు చెప్పారు. ఈ విషయాన్ని మీ అధికారులకు చెప్పండి అంటూ అక్కడే ఉన్న హైడ్రా సిబ్బందిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు.