హైదరాబాద్, మే 26 (నమస్తే తెలంగాణ): పురావస్తు సంపదకు పేరుగాంచిన సిద్దిపేట జిల్లాలో కొత్త రాతియుగంనాటి వస్తువులు బయటపడ్డాయి. జిల్లాలోని కొండపాక పాటిగడ్డ వద్ద కొత్త తెలంగాణ చరిత్రబృందం జరిపిన పరిశోధనల సందర్భంగా కొత్త రాతియుగానికి చెందిన మూడు గొడ్డళ్లు, ఒక శాతవాహన కాలంనాటి ఒక టెర్రకోట బొమ్మ, వక్షబంధంతో రాచపురుషుని టార్సో(దేహభాగం) లభించాయి. అంతేకాకుండా రంగురంగుల గాజుపూసలు, దంతపు పాచిక, రెండంచుల రాతిగొడ్డలి, టెర్రాకోట బొమ్మల శకలాలు లభించాయి.
పురావస్తుశాఖ శాస్త్రీయ పద్ధతిలో పరిశోధనలు చేపడితే కొండపాకలో మరింత విలువైన పురావస్తు సంపద వెలుగుచూసే అవకాశమున్నదని కొత్త తెలంగాణ చరిత్రబృందం కన్వీనర్ శ్రీరామోజు హరగోపాల్ తెలిపారు. విలువైన పురావస్తు సంపద చెల్లాచెదురైపోకముందే ప్రభుత్వం చర్యలు చేపట్టాలని ఆయన విజ్ఞప్తిచేశారు. సిద్దిపేట జిల్లా కొండపాక చరిత్ర పూర్వపుయుగ పురావస్తు సంపద, రాష్ట్రకూట శిల్పాలు, కాకతీయ శాసనాలు, పలు దేవాలయాలకు ప్రసిద్ధిచెందిన విషయం విదితమే.