గోవిందరావుపేట, ఫిబ్రవరి 6: కుటుంబ కలహాలతో మనస్తాపానికి గురై ఏఆర్ ఎస్సై సూర్నపాక లక్ష్మీనర్సు(37) ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం పస్రాలో చోటు చేసుకుంది. పస్రా ఎస్సై కమలాకర్ తెలిపిన వివరాల ప్రకారం.. లక్ష్మీనర్సు, ఆయన భార్య వినోద పదేళ్లుగా పస్రాలో నివాసం ఉంటున్నారు. లక్ష్మీనర్సు ఏడూళ్ల బయ్యారంలోని 15వ బెటాలియన్‌లో ఏఆర్ ఎస్సైగా విధులు నిర్వర్తిస్తుండగా భార్య వినోద మేడారంలోని ప్రభుత్వ పాఠశాలలో టీచర్‌గా పనిచేస్తున్నది.
బుధవారం ఉదయం లక్ష్మీనర్సు గుండాలలో నివసిస్తున్న అక్క దగ్గరికి భార్యాపిల్లలతో కలిసి వెళ్లాడు. అక్కడ ఫంక్షన్లో భార్యాభర్తల మధ్య చిన్న లొల్లి జరిగింది. అదే రోజు రాత్రి 9గంటల సమయంలో ఇంటికి రాగా మళ్లీ గొడవ జరిగింది. దీంతో ఏఆర్ఎస్సై భార్యను రూమ్‌లో నుంచి బయటకు నెట్టేసి తలుపు గడియ పెట్టుకున్నారు. మరో గదిలో ఇద్దరు పిల్లలు నిద్రపోయారు. గురువారం ఉదయం పిల్లలు లేచి తండ్రిని పిలువగా తలుపులు తీయలేదు. దీంతో అనుమానం వచ్చిన పిల్లలు కిటికీలో నుంచి చూడగా ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఉండటాన్ని గుర్తించారు. మృతుడి తండ్రి ధర్మయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై పేర్కొన్నారు.