సిద్దిపేట టౌన్, డిసెంబర్ 29 : అప్పుల బాధ తాళలేక ఏఆర్ కానిస్టేబుల్ తన భార్యాపిల్లలకు ఎలుకలమందు తాగించి, తాను ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన సిద్దిపేట జిల్లా కేంద్రంలోని కాళ్లకుంట కాలనీలో ఆదివారం కలకలంరేపింది. సిద్దిపేట వన్‌టౌన్ సీఐ వాసుదేవరావు, బాధితుల వివరాల ప్రకా రం.. రాజన్నసిరిసిల్ల జిల్లా లింగన్నపేటకు చెందిన బండారి బాలకృష్ణ (34) రాజన్నసిరిసిల్లలోని 17వ బెటాలియన్‌లో ఏఆర్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. కొత్తగా ఇంటి నిర్మాణానికి కొంత అప్పుచేయగా, ముంబయికి చెందిన ఓ ప్రైవేట్ కంపెనీలో రూ.25 లక్షల వరకు పెట్టుబడిపెట్టి మోసపోయాడు. శనివారం రాత్రి విధులు ముగించుకుని ఇంటికి వచ్చి, తాను ప్రైవేట్ కంపెనీలో డబ్బులు పెట్టి మోసపోయానని భార్యతో చెప్పి బాధపడ్డాడు. అప్పులవారు వేధించకుండా ఉండాలంటే ఆత్మహ త్య ఒక్కటే మార్గమని భావించాడు. భార్య మానసకు చాయ్ పెట్టమని చెప్పి ఆమెకు తెలియకుండా అందులో ఎలుకల మందు కలిపాడు. భార్య, కొడుకులు యశ్వంత్, అశ్విత్‌కు ఆ చాయ్ తాగించి తా నూ తాగాడు. కొద్దిసేపటి తర్వాత తనకు ఏమీ కాకపోవడంతో పక్క గదిలోకి వెళ్లి ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆదివా రం తెల్లవారుజామున మానస పక్కగదిలోకి వెళ్లి చూడగా భర్త ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించాడు. ఎలుకల మందు తాగినవారి ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు ధ్రువీకరించారు. పోలీసులు కేసు దర్యాఫ్తు చేస్తున్నారు.