హైదరాబాద్ సిటీబ్యూరో/మషీరాబాద్, ఏప్రిల్ 28: దళితబంధు లాంటి పథకాలతో అట్టడుగు వర్గాల్లో వెలుగులు నింపుతున్న సీఎం కేసీఆర్ దళిత పక్షపాతి అని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ కొనియాడారు. హైదరాబాద్ విద్యానగర్లోని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. దళితుల కోసం పరితపిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్కు త్వరలో ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో కృతజ్ఞత సభ నిర్వహించనున్నట్టు వెల్లడించారు. దళితులను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు దళితబంధు పథకాన్ని అమలు చేస్తున్న ముఖ్యమంత్రికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. దేశంలోనే 125 అడుగుల అంబేద్కర్ భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేసి వన్నె తెచ్చారని అభివర్ణించారు. త్వరలో ప్రారంభించనున్న రాష్ట సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టి దళిత వర్గాలపై చిత్తశుద్ధిని చాటుకున్నారని తెలిపారు. దళితబంధు పథకంలో కొంతమంది కమీషన్లు తీసుకోవడంపై స్వయంగా ముఖ్యమంత్రే అధ్యయనం చేయడం హర్షణీయమని పేర్కొన్నారు. రెండో విడత కలెక్టర్ల ద్వారా పారదర్శకంగా అర్హులను ఎంపిక చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. సమావేశంలో ఎమ్మార్పీఎస్ నాయకులు కొల్లూరి వెంకట్, వరిగడ్డి చందు, గుమ్మడిపల్లి తిరుమలేశ్, జన్నారపు జీవన్, శ్రీకాంత్, కార్తీక్ తదితరులు పాల్గొన్నారు.