సిద్దిపేట/ గజ్వేల్, మార్చి 1: తెలంగాణలో ప్రభుత్వం చెక్‌డ్యాంలు, సాగునీటి ప్రాజెక్టులు నిర్మించి వ్యవసాయాభివృద్ధికి అద్భుతంగా కృషి చేస్తున్నదని పంజాబ్ వ్యవసాయ విశ్వవిద్యాలయ డైరెక్టర్, శాస్త్రవేత్తలు ప్రశంసించారు. సిద్దిపేటలోని కోమటి చెరువు, గజ్వేల్‌లో పాండవుల చెరువు, మర్కూక్ మండలం ఎర్రవల్లిలో చెక్‌డ్యామ్, పాండురంగసాగర్ రిజర్వాయర్, కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్లు, నారాయణరావుపేట మండలంలోని గుర్రాలగొంది, ఇబ్రహీంపూర్ గ్రామాల్లో చెరువులు, చెక్‌డ్యామ్‌లను బుధవారం వారు పరిశీలించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వ్యవసాయాభివృద్ధి కోసం చెక్‌డ్యామ్‌లు, రిజర్వాయర్లు నిర్మించడం చాలా సంతోషాన్ని కలిగించిందని చెప్పారు. పంజాబ్‌లోనూ ప్రాజెక్టులు ఉన్నా తెలంగాణ మాదిరిగా చెరువులు, కుంటలు చెక్‌డ్యామ్‌లను నీటితో నింపడం లేదని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న జల విధానం అమోఘంగా ఉన్నదని మెచ్చుకున్నారు. ఈ విధానం రైతులకు ఎంతో మేలు చేస్తున్నదని చెప్పారు. కోమటి చెరువు సుందరీకరణ అద్భుతంగా ఉన్నదని, పర్యాటక కేంద్రంగా మారిందని అభినందించారు.