హైదరాబాద్, అక్టోబర్ 6 (నమస్తే తెలంగాణ): డీఎస్సీలో ఎంపికైన అభ్యర్థులకు ఈ నెల 9న ఎల్బీ స్టేడియంలో సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా నియామక పత్రాలను అందజేయనున్నట్టు సీఎస్ శాంతికుమారి వెల్లడించారు. ఈ కార్యక్రమ ఏర్పాట్లపై సీఎస్ ఆదివారం సచివాలయం నుంచి జిల్లా కలెక్టర్లతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. సాయంత్రం 4 గంటలకు జరిగే ఈ కార్యక్రమంలో దాదాపు 10 వేల మందికి పైగా అభ్యర్థులు పాల్గొంటారని చెప్పారు. ఇప్పటికే డీఎస్సీ సర్టిఫికెట్ వెరిఫికేషన్ పూర్తయిందని, సోమవారం సాయంత్రంలోగా తుది జాబితాలను జిల్లా కలెక్టర్లకు పంపుతామని పేర్కొన్నారు. ఎంపికైన అభ్యర్థులంతా ఎల్బీ స్టేడియానికి చేరుకునేలా చూడాలని, బస్సులు సహా అన్ని ఏర్పాట్లు చేయాలని తెలిపారు. ఎల్బీస్టేడియంలో అభ్యర్థులకు నియామక పత్రాలిచ్చేందుకు జిల్లాల వారీగా ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. కాన్ఫరెన్స్‌లో విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం, నగర పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్, అడిషనల్ డీజీ మహేశ్ భగవత్, ఆర్అండ్బీ ప్రత్యేక కార్యదర్శి హరిచందన, పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ ఈవీ నర్సింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
డీఎస్సీ అభ్యర్థులకు ఇప్పటికిప్పుడు నియామక పత్రాలిచ్చినా పోస్టింగ్‌కు కొంత సమయం పట్టనున్నది. వెంటనే పోస్టింగ్ ఇస్తే జీవో 317 బాధితులకు తీరని అన్యాయం జరుగుతుందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. డీఎస్సీ ఉద్యోగాల ఎంపిక ప్రక్రియలో దివ్యాంగ కోటా అభ్యర్థులు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తంచేస్తున్నారు. మెడికల్ బోర్డును నియమించకుండా, సర్టిఫికెట్ వెరిఫికేషన్ నిర్వహించకుండా ఇష్టారీతిన చేస్తున్నారని అభ్యర్థులు మండిపడుతున్నారు. గురుకుల బోర్డు, టీజీపీఎస్సీ తరహాలో పకడ్బందీగా వెరిఫికేషన్ చేపట్టడంలేదని ఆరోపిస్తున్నారు. మెడికల్ బోర్డును నియమించి, పరీక్షలు నిర్వహించిన తర్వాతే దివ్యాంగుల కోటా ఉద్యోగాలను భర్తీచేయాలని తెలంగాణ సమీకృత వికలాంగుల సంఘం నేతలు ప్రభుత్వాన్ని కోరారు.