హైదరాబాద్, మే 28 (నమస్తే తెలంగాణ): రాజీవ్ యువ వికాసం పథకం ద్వారా అందే ఆర్థిక తోడ్పాటుతో యువత జీవితాల్లో వెలుగులు నింపాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార అధికారులకు సూచించారు. రూ.8 వేల కోట్లతో 5లక్షల మంది యువతకు ఉపాధి కల్పించబోతున్నామని, వ్యాపార కార్యకలాపాలు విస్తృతమై రాష్ట్ర జీడీపీ పెరిగే అవకాశం ఉంటుందని చెప్పారు. బుధవారం మంత్రి పొన్నం ప్రభాకర్తో కలిసి రాజీవ్ యువ వికాసం అమలుపై జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్లకు భట్టి పలు కీలక సూచనలు చేశారు. ఆర్థిక సహాయం అందించాం, పని పూర్తయిందని కాకుండా లబ్ధిపొందిన యువత లాభాలు పొందుతున్నారా? లేదా? ఎవరైనా ఇబ్బందులతో వ్యాపారం నిర్వహించలేకపోతే అధికారులు జోక్యం చేసుకొని వ్యాపారాలను పునరుద్ధరించాలని సూచించారు. పర్యవేక్షణకు మండలస్థాయిలో అధికారులను నియమించాలని కోరారు.