హైదరాబాద్, జనవరి 19 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ విద్యుత్తు ఉత్పాదక సంస్థ(టీజీ జెన్కో)లో ఇంజినీర్లు, సిబ్బంది బదిలీలకు సంస్థ పచ్చజెండా ఊపింది. బదిలీల షెడ్యూల్ను సైతం విడుదల చేసింది. ఆశావాహులు మంగళవారం (ఈనెల 20) నుంచి 22వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇదే తేదీల్లో ఆప్షన్లు కూడా ఎంచుకోవచ్చు. ఈ నెల 23 నుంచి 29 వరకు దరఖాస్తుల పరిశీలన జరిపి, బదిలీల జాబితా రూపొందిస్తారు. ఈ నెల 30, 31 తేదీల్లో బదిలీ ఉత్తర్వులు విడుదల చేస్తారు. ఇది వరకు ట్రాన్స్ఫర్ పాలసీ లేకపోగా, తాజాగా పాలసీని విడుదల చేశారు. హైదరాబాద్లో పదేండ్లు పూర్తిచేసుకున్న వారిని తప్పనిసరిగా బదిలీచేస్తారు. ప్లాంట్లల్లో 15 ఏండ్లు పనిచేసిన వారికి హైదరాబాద్లో పోస్టింగ్ ఇస్తారు. మెడికల్ 25, స్పౌజ్ 25, వ్యక్తిగత వినతుల కోటాలో 50% మేర అవకాశం కల్పిస్తారు.
వైటీపీఎస్కు 10 మంది..
రామగుండంలో పనిచేస్తున్న మరో 10 మంది ఉద్యోగులను జెన్కో యాజమాన్యం బదిలీచేసింది. వీరికి యాదాద్రి పవర్ ప్లాంట్లో పోస్టింగ్ ఇచ్చింది. వీరిలో అకౌంట్స్ ఉద్యోగులు, జూనియర్ అసిస్టెంట్లు ఉన్నారు. రామగుండంలోని ఆర్టీఎస్-బీ స్టేషన్ను మూసివేయడంతో, ఈ ప్లాంట్లోని ఉద్యోగులను వైటీపీఎస్కు బదిలీచేశారు.