హైదరాబాద్, జనవరి 21 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో టీచర్ల బదిలీలకు దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ఈ నెల 28 నుంచి ప్రారంభం కానుంది. 3 రోజుల పాటు ఆన్లైన్లో ఉపాధ్యాయుల నుంచి దరఖాస్తులను స్వీకరిస్తారు. ఆ తర్వాతే పదోన్నతులు, బదిలీల ప్రక్రియ ప్రారంభంకానున్నది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ అధికారులు షెడ్యూల్‌ను రూపొందించారు. రాష్ట్రంలో పదోన్నతులు, బదిలీల ప్రక్రియ ఈ నెల 27 నుంచి ప్రారంభంకానుండగా, తొలిరోజు సీనియారిటీ జాబితాలను ఆన్లైన్లో ప్రదర్శిస్తారు. ఆ తర్వాత 28 నుంచి బదిలీలకు దరఖాస్తులను స్వీకరించాలని అధికారులు నిర్ణయించారు. తొలుత బదిలీల కోసం వెబ్ ఆప్షన్ల ఎంపికకు మాత్రమే అవకాశమివ్వగా, తాజాగా ఈ ఆప్షన్ల ఎంపికలో దొర్లిన తప్పుల సవరణకు ఒకరోజు అవకాశం ఇవ్వాలని అధికారులు నిర్ణయించారు. బదిలీల కోసం ఆప్షన్ ఎంచుకున్న తర్వాత వాటి సవరణకు ప్రధానోపాధ్యాయులు, స్కూల్ అసిస్టెంట్లు, సెకండరీ గ్రేడ్ టీచర్లకు (ఎస్జీటీలు) ఒకరోజు పాటు అవకాశం ఇస్తారు.
ఉపాధ్యాయ సంఘాల హర్షం
పదోన్నతులు, బదిలీల ప్రక్రియను ప్రకటించడంపై ఉపాధ్యాయ సంఘాలు శనివారం హర్షాతిరేకాలు వ్యక్తంచేశాయి. ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతించిన సంఘాలు, సీఎం కేసీఆర్, మంత్రులు హరీశ్‌రావు, సబితాఇంద్రారెడ్డికి ధన్యవాదాలు తెలిపాయి. బదిలీలు, పదోన్నతుల్లో పలు అంశాలను పరిగణనలోకి తీసుకోవాలని వివిధ సంఘాల నేతలు సూచించారు. హైకోర్టు తుది తీర్పునకు లోబడి భాషా పండితులకు పదోన్నతులు కల్పించాలని పండిత జేఏసీ నేతలు జగదీశ్, ఎండీ అబ్దుల్లా, కాంతికృష్ణ, చక్తవర్తుల శ్రీనివాస్, జిల్లా పరిషత్, మండల పరిషత్ స్కూళ్లల్లో పనిచేస్తున్న గవర్నమెంట్ స్కూల్ టీచర్లను తిరిగి వెనక్కి రప్పించాలని లోకల్ కేడర్ గవర్నమెంట్ టీచర్స్ అసొసియేషన్ అధ్యక్షుడు మామిడోజు వీరాచారి, జీరో సర్వీసు బదిలీలకు అనుమతివ్వాలని యూటీఎఫ్ నేతలు జంగయ్య, చావా రవి ప్రభుత్వాన్ని కోరారు.
సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు
మన ఊరు -మన బడితో ప్రభుత్వ బడుల రూపురేఖలు మారనున్నాయి. బదిలీలు, పదోన్నతులతో చక్కని విద్య అందుంతున్నది. టీచర్లకు శుభవార్త చెప్పిన కేసీఆర్ సర్కారు ఎంప్లాయ్ ఫ్రెండ్లీ ప్రభుత్వమని చాటుకున్నది. కేసీఆర్‌కు మంత్రులు హరీశ్‌రావు, సబితాఇంద్రారెడ్డికి ధన్యవాదాలు.
– బీరెల్లి కమలాకర్‌రావు, పీఆర్టీయూ టీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
ఉపాధ్యాయలోకం హర్షిస్తున్నది
సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు టీచర్ల పదోన్నతులు, బదిలీలు చేపట్టడాన్ని యావత్తు ఉపాధ్యాయ లోకం హర్షిస్తున్నది. గెజిటెడ్ హెచ్ఎంలకు సైతం శుభవార్త చెప్పడం సంతోషదాయకం. అయితే గెజిటెడ్ హెచ్ఎంల బదిలీకి గల గరిష్ఠ కాలాన్ని ఐదేండ్లకే పరిమితం చేసి బదిలీలు చేపట్టాలి.
– రాజభాను చంద్రప్రకాశ్,గెజిటెడ్ హెచ్ఎం అసోసియేషన్ అధ్యక్షుడు