హైదరాబాద్, జూలై 11 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని 34 ప్రభుత్వ మెడికల్ కళాశాలల్లో 607 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల దరఖాస్తు తేదీల్లో మార్పులు చేసినట్టు మెడికల్ అండ్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు వెల్లడించింది. శుక్రవారం బోర్డు ప్రకటన విడుదల చేసింది. 10 నుంచి 17వరకు దరఖాస్తులు తీసుకోవాల్సి ఉండగా డాక్టర్ల విజ్ఞప్తి మేరకు ఈనెల 20 నుంచి 27 వరకు దరఖాస్తులు తీసుకోనున్నట్టు స్పష్టంచేసింది. 20 నుంచి బోర్డు వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించింది.
వెబ్ ఆప్షన్లకకు 1,197 మంది దూరం
హైదరాబాద్, జూలై 11 (నమస్తే తెలంగాణ) : ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహిస్తున్న ఎప్‌సెట్ మాక్ సీట్ల కేటాయింపు ఆదివారం (ఈనెల 13న) జరగనున్నది. విద్యార్థి ఎంపికచేసుకున్న కాలేజీలను బట్టి మాక్ సీట్ అలాట్మెంట్ చేస్తారు. కాలేజీలను తప్పుగా ఎంపికచేసుకుని ఉంటే ఎడిట్ ఆప్షన్ ద్వారా సవరించుకోవచ్చు. ఈ సారి 1,197 మంది వెబ్ ఆప్షన్లు ఎంచుకోలేదు. 95,256 మంది సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు హాజరుకాగా, 94,059 మంది వెబ్ ఆప్షన్లు ఎంచుకున్నారు.
15 నుంచి జేఈఈ, నీట్శిక్షణ
హైదరాబాద్, జూలై 11 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలోని సర్కారు జూనియర్ కాలేజీల్లో ఈ నెల 15 నుంచి జేఈఈ, నీట్, క్లాట్ ఉచిత శిక్షణ ప్రారంభంకానున్నది. సోమవారం నుంచి శుక్రవారం వరకు ఈ శిక్షణ ఉంటుంది. ఇంటరాక్టివ్ ప్లాట్ ప్యానళ్లు (ఐఎఫ్‌పీల) ద్వారా డిజిటల్ క్లాసులను ప్రసారం చేస్తారు.