Gurukula Schools | హైదరాబాద్, ఫిబ్రవరి 22 (నమస్తే తెలంగాణ): దేశానికే తలమానికంగా నిలిచిన తెలంగాణ గురుకులాలు కాంగ్రెస్ ప్రభుత్వం విధానాలతో కుంటుబడిపోతున్నాయి. నిన్నమొన్నటి వరకు గురుకులాల్లో ప్రవేశాల కోసం తీవ్రంగా పోటీపడ్డ విద్యార్థులు ఇప్పుడు మొఖం చాటేస్తున్నారు. తల్లిదండ్రులు సైతం ‘వామ్మో గురుకులం’ అంటూ హడలెత్తిపోతున్నారు. విద్యార్థులను చేర్పించేందుకు అనాసక్తి చూపుతున్నారు. తాజాగా ప్రవేశాల కోసం వచ్చిన దరఖాస్తులే అందుకు నిదర్శనంగా నిలుస్తాయి.
ఈ ఏడాది 88వేల దరఖాస్తులే
ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, జనరల్ గురుకులాల్లో 5 నుంచి 9వ తరగతి వరకు ప్రవేశాల కోసం నేడు రాత పరీక్షను నిర్వహించనున్నది. మొత్తం 1,67,649 దరఖాస్తులు రాగా అందులో 5వ తరగతి ప్రవేశాల కోసం 88,451వేలు కాగా మిగిలినవి 6, 7, 8, 9వ తరగతుల్లో ప్రవేశాలకు సంబంధించినవని అధికారులు తెలిపారు. నిరుడితో పోల్చితే దరఖాస్తులు 40వేలకు పైగా తగ్గిపోయినట్టు చెప్పారు.
నిన్నమొన్నటివరకూ విపరీతమైన పోటీ
సాంఘిక, గిరిజన, బీసీ, జనరల్ రెసిడెన్షియల్ విద్యాసంస్థల్లో ప్రవేశాల కోసం నిన్నమొన్నటి వరకూ విపరీతమైన పోటీ నెలకొన్నది. పేద, మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతులకు చెందిన తల్లిదండ్రులు కూడా వారి పిల్లలను గురుకులాల్లో చేర్చేందుకు ఎంతో ఆసక్తి చూపారు. ఉత్సాహంతో ముందుకొచ్చారు. కార్యాలయాల చుట్టూ ప్రదక్షణ చేశారు. అధికారులే సీట్లు ఫుల్ అంటూ బోర్డు పెట్టుకున్న పరిస్థితి. అందుకు గతంలో సీట్ల భర్తీకి వచ్చిన దరఖాస్తులే నిదర్శనం. ఒకానొక దశలో 50వేల సీట్ల కోసం దాదాపు 1.5 లక్షల మంది విద్యార్థులు అంటే ఒక సీటుకు ముగ్గురు పోటీ పడిన పరిస్థితి ఉండేది. కానీ, కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలతో ప్రస్తుతం గురుకులాల్లో ప్రవేశాలకు విద్యార్థులు అనాసక్తి చూపుతున్నారు. తల్లిదండ్రులు జంకుతున్నారు. బీఆర్ఎస్ హయంలో 2023-24 విద్యాసంవత్సరానికి కేవలం ఒక్క 5వ తరగతి ప్రవేశాలకు దరఖాస్తులను స్వీకరించగా 1.34లక్షల మంది అప్లయ్ చేసుకున్నారు. 2024-25 విద్యాసంవత్సరానికి కూడా 1,20,654 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. అందులో రాత పరీక్షకు 1.13 లక్షల మంది హాజరయ్యారు. తుదకు మొత్తంగా అందుబాటులో ఉన్న 51,968 సీట్లలో 50,961 సీట్లనే భర్తీ చేశారు.
ప్రభుత్వ నిర్లక్ష్యం.. ఫుడ్‌పాయిజన్ కేసులు
విద్యార్థుల అప్లికేషన్లు గణనీయంగా తగ్గిపోవడానికి గురుకులాల్లో వరుసగా చోటుచేసుకుంటున్న ఫుడ్‌పాయిజన్ కేసులు, విద్యార్థుల మరణాలే కారణమని అధికారవర్గాలు భావిస్తున్నాయి. నిరుడు జనవరి 22న నల్లగొండ జిల్లా కొండమల్లేపల్లి ఎస్సీ గురుకులంలో 9వ తరగతి విద్యార్థిని అనుమానాస్పద మృతితో మొదలైన విద్యార్థుల మరణాలు నేటికీ కొనసాగుతున్నాయి. ఆహారం కలుషితం కావడం, విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడటం లాంటి ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. ప్రస్తుతం నమోదైన మొత్తం మృతి కేసుల్లో 25 మంది విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. తొమ్మిది మంది విద్యార్థులు అనుమానాస్పద స్థితిలో మృతిచెందగా, ఫుడ్‌పాయిజన్‌తో ముగ్గురు విద్యార్థులు మృతిచెందారు. అనారోగ్యం కారణంతో పలువురు విద్యార్థులు మృతిచెందారు. గడచిన ఏడాది కాలంలోనే దాదాపు 52 మంది గురుకుల విద్యార్థులు మృతిచెందినట్టు గణాంకాలు వెల్లడిస్తున్నాయి.
ఇవి కేవలం ప్రభుత్వం గురుకులాలు, సంక్షేమహాస్టళ్లలోని ఘటనలు మాత్రమే కావడం గమనార్హం. ఇవికాకుండా ఇప్పటివరకు 45కుపైగా గురుకులాల్లో ఈ ఏడాది ఫుడ్‌పాయిజన్ కేసులు నమోదు కాగా, దాదాపు 1000 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఇంతజరుగుతున్నా ప్రభుత్వం నుంచి ఏమాత్రం చలనం లేకుండాపోయిందని విద్యార్థి సంఘాలు విమర్శిస్తున్నాయి. ఫుడ్‌పాయిజన్ ఘటనలు వెలుగులోకి వచ్చినప్పుడు, విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడినప్పుడు ఆయా గురుకులాల ఉన్నతాధికారులు హడావుడి చేయడం, విచారణ కమిటీ వేయడం, కిందిస్థాయి ఉద్యోగులను సస్పెండ్ చేసి చేతులు దులుపుకోవడం రివాజుగా మారింది తప్ప నిర్మాణాత్మకమైన చర్యలు తీసుకున్న దాఖలాల్లేవు. ఇక ఎస్సీ, ఎస్టీ సంక్షేమ గురుకులాలకు 14నెలలుగా మంత్రి లేడు. ఆ శాఖ ముఖ్యమంత్రి వద్దనే ఉన్నది. గురుకులాలపై పర్యవేక్షణ లేకుండా పోయింది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం గురుకులాల్లో ప్రవేశాలు పొందేందుకు విద్యార్థులు జంకుతున్నారని భావిస్తున్నారు.
విద్యార్థులందరూ పరీక్షకు హాజరుకావాలి ; బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్
గురుకుల ప్రవేశ పరీక్షకు దరఖాస్తు చేసుకున్న విద్యార్థులందరూ పరీక్షకు హాజరుకావాలని బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. సచివాలయంలో శనివారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. 5వ తరగతి నుంచి 9వ తరగతి వరకు గురుకులాల్లో సీట్ల భర్తీ కోసం ప్రవేశ పరీక్ష నిర్వహించనుండగా, మొత్తంగా 1,67,649 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు. ప్రవేశపరీక్షను ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. పరీక్ష రాయనున్న విద్యార్థులకు శుభాకాంక్షలు చెప్పారు.