హైదరాబాద్, ఏప్రిల్18 (నమస్తే తెలంగాణ): బీసీ గురుకుల డిగ్రీ కాలేజీల్లో 2026-27 విద్యా సంవత్సరానికి ప్రవేశానికి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. బీసీ గురుకులాల్లో ఇంటర్ పూర్తిచేసిన విద్యార్థులు సంబంధిత కాలేజీ ప్రిన్సిపాల్ ద్వారా డిగ్రీ కోర్సులకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఇతర విద్యాసంస్థల్లో ఇంటర్ చదివి ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు ఆన్లైన్ mjptbcwreis. telangana.gov.in, లో దరఖాస్తులను మే 10లోగా సమర్పించాలని సూచించారు. ఇంటర్ మారుల మెరిట్ ఆధారంగా సీట్ల కేటాయింపు ఉంటుందని వివరించారు. వివరాలకు 040 23328266 నంబర్లో సంప్రదించాలని కార్యదర్శి ప్రకటనలో సూచించారు.
గురుకులాల్లో డిప్యూటీ వార్డెన్లపై వివక్ష ; మైనారిటీ గురుకుల ఉద్యోగ, ఉపాధ్యాయ అసోసియేషన్ ఫైర్
హైదరాబాద్, ఏప్రిల్18 (నమస్తే తెలంగాణ): మైనారిటీ గురుకులాల్లో ఔట్ర్సింగ్పై పనిచేస్తున్న డిప్యూటీ వార్డెన్లపై ప్రభుత్వం వివక్ష చూపుతున్నదని మైనారిటీ గురుకుల ఉద్యోగ, ఉపాధ్యాయ అసోసియేషన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. 12నెలల వేతనం చెల్లిస్తామని హామీ ఇచ్చి అమలు చేయడం లేదని మండిపడింది. అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మహమ్మద్ రాజమ్మద్, ఉపాధ్యక్షుడు మహమ్మద్ యాకూబ్‌పాషా శనివారం ప్రకటన విడుదల చేశారు. హాస్టల్ నిర్వహణ, మెనూ అమలు, శానిటేషన్ పర్యవేక్షణ, నాన్-టీచింగ్ సిబ్బంది సమన్వయం తదితర కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న డిప్యూటీ వార్డెన్లకు తగిన గౌరవం, ఉద్యోగ భద్రత కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని మండిపడ్డారు. మైనారిటీ గురుకులాల సెక్రటరీతోపాటు ఉన్నతాధికారులు వెంటనే స్పందించి డిప్యూటీ వార్డెన్లకు 12నెలల జీతం, ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. లేదంటే ఆందోళనలు కార్యక్రమాలకు దిగుతామని హెచ్చరించారు.