నిర్మల్ అర్బన్, జూలై 12: నిర్మల్‌లో బీజేపీకి పెద్ద షాక్ తగిలింది. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, నిర్మల్ మున్సిపల్ మాజీ చైర్మన్ అప్పాల గణేశ్ చక్రవర్తి తిరిగి సొంత గూటికి చేరుకున్నారు. బుధవారం ఆయన కమలం వీడి కారెక్కారు. నిర్మల్ పట్టణంలోని దివ్య గార్డెన్లో అటవీ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. అప్పాల గణేశ్‌తో పాటు ఆయన అనుచరులకు మంత్రి గులాబీ కండువా కప్పి బీఆర్ఎస్లోకి ఆహ్వానించారు. అంతకు ముందు బైల్ బజార్ నుంచి దివ్యాగార్డెన్ వరకు ఆయన అనుచరులతో బైక్ ర్యాలీ నిర్వహించారు. గణేశ్‌తోపాటు కౌన్సిలర్లు కత్తి నరేందర్, సైండ్ల శ్రీధర్, మాజీ కౌన్సిలర్లు చందుపట్ల రవి, తోట నర్సయ్య, గోపు గోపి, నేళ్ల అరుణ్, సాకీర్, అలీం, అప్పాల ప్రభాకర్ పార్టీలో చేరారు.