హైదరాబాద్, డిసెంబర్ 21(నమస్తే తెలంగాణ) : తెలంగాణ అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్(ఏపీపీ) పరీక్ష పేపర్-1 ప్రాథమిక ‘కీ’ విడుదల చేసినట్టు పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు చైర్మన్ వీవీ శ్రీనివాసరావు ఆదివారం ప్రకటనలో తెలిపారు. 21న సాయంత్రం 5గంటల నుంచి బోర్డు వెబ్సైట్ www.tgprb.inలో ఉంచామని పేర్కొన్నారు. ప్రాథమిక ‘కీ’పై ఏవైనా అభ్యంతరాలు ఉంటే డిసెంబర్ 24వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు ఆన్లైన్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు.
ప్రతి అభ్యంతరానికి అభ్యర్థులు రూ. 500 చొప్పున చెల్లించాల్సి ఉంటుందని వెల్లడించారు. అభ్యంతరం సరైనదిగా తేలితే, ఆ మొత్తాన్ని తిరిగి రీఫండ్ చేస్తామని చెప్పారు. ప్రతి ప్రశ్నకు విడివిడిగా, నిర్ణీత వెబ్ టెంప్లేట్ ద్వారా మాత్రమే అభ్యంతరాలు సమర్పించాలని, సంబంధిత ఆధార పత్రాలు జత చేయడం తప్పనిసరని పేర్కొన్నారు. మ్యాన్యువల్‌గా పంపే దరఖాస్తులను బోర్డు పరిగణనలోకి తీసుకోదని, ఏదైనా ప్రశ్నను తొలగిస్తే, ఆ మారులను అభ్యర్థులందరికీ దామాషా పద్ధతిలో కేటాయిస్తామని స్పష్టంచేశారు.
హైదరాబాద్, డిసెంబర్ 21(నమస్తే తెలంగాణ) : మూడేండ్లు, ఐదేండ్ల లా కోర్సుల మార్కుల విధానంలో ఉస్మానియా యూనివర్సిటీ మార్పులు చేసింది. ఇంటర్నల్, సెమిస్టర్ పరీక్షల విధానంలో మార్పులు చేసింది. ఇంటర్నల్ మా ర్కులు పెంచి, సెమిస్టర్ మార్కులు తగ్గించింది. ఇప్పటివరకు ఇంటర్నల్స్‌కు 20, సెమిస్టర్ పరీక్షలకు 80 మార్కులు ఉన్నాయి. దీని స్థానంలో ఇంటర్నల్స్‌కు 30, సెమిస్టర్ పరీక్షలకు 70 మార్కులకు పరిమితం చేశారు. ఈ విద్యాసంవత్సరం పాత మార్కుల విధానమే కొనసాగనున్నది. కొత్త మార్కుల విధానం(2026-27) విద్యాసంవత్సరం నుంచి అమల్లోకి వస్తుందని ఓయూ వర్గాలు తెలిపాయి.
హైదరాబాద్, డిసెంబర్ 21(నమస్తే తెలంగాణ) : సీపీఎస్ రద్దు చేసి, పాత పింఛన్ పథకాన్ని పునరుద్ధరించాలని తెలంగాణ రాష్ట్ర టీచర్స్ ఫెడరేషన్(టీఆర్టీఎఫ్) ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఇన్ సర్వీస్ టీచర్లను టెట్ నుంచి మినహాయించాలని, 52% ఫిట్మెంట్తో పీఆర్సీ ప్రకటించాలని, పెండింగ్‌లోని డీఏలను తక్షణమే విడుదల చేయాలని కోరింది. టీఆర్టీఎఫ్ 80 వసంతరాల అభ్యుదయోత్సవం – విద్యాసదస్సును రాష్ట్ర అధ్యక్షుడు కటకం రమేశ్, ప్రధాన కార్యదర్శి మారెడ్డి అంజిరెడ్డి అధ్యక్షతన ఆదివారం హైదరాబాద్‌లో నిర్వహించారు.
మంత్రులు అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, పొన్నం ప్రభాకర్, శ్రీధర్‌బాబు, ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్‌రెడ్డి పాల్గొని ఉపాధ్యాయ సమస్యలు పరిష్కరించేందుకు కృషిచేస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా 2003 డీఎస్సీ టీచర్లకు పాత పింఛన్ అమలుచేయాలని, హైస్కూళ్లకు హెచ్ఎం, పీఈటీ పోస్టులు మంజూరుచేయాల ని, జీపీఎఫ్ వడ్డీరేట్లు ప్రకటించాలని, ప్రతి సంవత్సరం పదోన్నతులు, బదిలీల క్యాలెండర్ అమలు చేయాలని, ప్రైమరీ స్కూళ్లకు పీఎస్ హెచ్ఎం పోస్టులు మం జూరుచేయాలని కోరుతూ సదస్సులో తీర్మానాలను ఆమోదించారు. మంత్రులు టీఆర్టీఎఫ్ డైరీ, వాల్ క్యాలెండర్, టేబుల్ క్యాలెండర్లను ఆవిష్కరించారు.