హైదరాబాద్, డిసెంబర్ 9 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ జరుగుతున్న రోజే అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ (ఏపీపీ) రాత పరీక్ష నిర్వహించడం సరికాదని, వెంటనే వాయిదా వేయాలని మాజీ మంత్రి హరీశ్‌రావు డిమాండ్ చేశారు. మంగళవారం హైకోర్టు సీనియర్ న్యాయవాది శివశేఖర్ ఆధ్వర్యంలో న్యాయవాదుల బృందం హరీశ్‌ను కలిసి వినతిపత్రం సమర్పించింది. డిసెంబర్ 14న జరుగాల్సిన ఏపీపీ పరీక్షను వాయిదా వేయించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని న్యాయవాదులు హరీశ్‌ను కోరగా ఆయన స్పందిసూ వాయిదా వేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో 118 అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పోస్టుల భర్తీకి సంబంధించి డిసెంబర్ 14న రాత పరీక్ష నిర్వహించడం కోసం నోటిఫికేషన్ ఇచ్చారు. అయితే, అదే రోజు రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలకు రెండో విడత పోలింగ్ జరుగనున్నది.