భూపాలపల్లి రూరల్, మార్చి 27: ‘భూపాలపల్లి కలెక్టరేట్లో బిల్లుల లొల్లి.. చెల్లింపు అధికారి, కాంట్రాక్టర్ మధ్య ఘర్షణ’ శీర్షికన శుక్రవారం ‘నమస్తే తెలంగాణ’లో వెలువడిన కథనంపై పోలీసులు స్పందించారు. దీనిపై భూపాలపల్లి పట్టణ సీఐ నరేశ్‌కుమార్ మాట్లాడారు. సీఐ తెలిపిన వివరాల ప్రకారం.. బుధవారం సాయంత్రం జయశంకర్భూపాలపల్లి జిల్లా గోరికొత్తపల్లి మండలంలో కాంట్రాక్టర్ సూరం వీరేందర్ సుమారు రూ. 33 లక్షలతో చేసిన అభివృద్ధి పనుల బిల్లుల కోసం భూపాలపల్లి కలెక్టరేట్లోని ఏపీఏవో ఏ ఫణీభూషన్ కశ్యప్ వద్దకు వెళ్లి తనకు బిల్లు చెల్లించాలని డిమాండ్ చేసి దూషించాడు. ఈ నేపథ్యంలో ఇరువురి మధ్య ఘర్షణ జరిగింది.
దీంతో ఫణిభూషన్ కశ్యప్ తన కాలింగ్ బెల్‌ను విసరడంతో తన కళ్లద్దాలు పగిలి గాయమైనట్లు కాంట్రాక్టర్ వీరేందర్ పోలీస్ స్టేషన్లో అదే రోజు రాత్రి ఫిర్యాదు చేశాడని సీఐ నరేశ్‌కుమార్ తెలిపారు. ఈ నేపథ్యంలో గురువారం సాయంత్రం ఏపీఏవో ఫణీభూషన్ కశ్యప్ పోలీస్ స్టేషన్‌కు వచ్చి కాంట్రాక్టర్ సూరం వీరేందర్ తన ఆఫీస్‌కు వచ్చి బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేశాడని తెలిపారు. తగినన్ని నిధులు లేవని, ప్రభుత్వం నుంచి వచ్చాకా బిల్లులు చెల్లిస్తామని చెప్పినా వినకుండా దురుసుగా ప్రవర్తించడంతోపాటు తనపై దాడి చేసేందుకు యత్నించి నా ఆఫీస్ సెల్‌ఫోన్‌ను తీసుకెళ్లాడని కాంట్రాక్టర్‌పై ఫిర్యాదు చేశారు. ఇరువురి ఫిర్యాదులు స్వీకరించి కేసులు నమోదు చేశామని, దీనిపై పూర్తి విచారణ చేపట్టినట్లు సీఐ నరేశ్‌కుమార్ తెలిపారు.