Dr BR ambedkar Statue | హైదరాబాద్ నగరంలో సీఎం కేసీఆర్ నేతృత్వంలోని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ భారీ విగ్రహాన్ని ఏపీ విద్యార్థి జేఏసీ నేతలు సందర్శించి, నివాళులర్పించారు. ఈ సందర్భంగా విద్యార్థి జేఏసీ నేతలు మాట్లాడుతూ ఏపీలో అభివృద్ధి శూన్యమని.. జగన్, చంద్రబాబు, పవన్ కల్యాణ్ అందరూ బీజేపీ పార్టీకి, ప్రధాని నరేంద్ర మోదీకి మద్దతు ఇస్తున్నారని విమర్శించారు. తెలంగాణలో కేటీఆర్ ఐటీరంగాన్ని ఎంతో అభివృద్ధి చేశారని, ఏపీలో మాత్రం అభివృద్ధి జరుగడం లేదని ఆరోపించారు. సీఎం జగన్ నాడు కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా సాధిస్తామన్నారని.. నేడు సలాం చేస్తూ గులాం గిరి చేస్తున్నారని విమర్శించారు. ఏపీలో ఏ పార్టీతో అభివృద్ధి సాధ్యం కాదని.. అందరూ బీజేపీకి భయపడి నరేంద్ర మోదీకి అమ్ముడుపోతున్నారన్నారు.
ఏపీలో ఆర్థిక పరిస్థితులు దారుణంగా ఉన్నాయని, 2024లో ఉమ్మడి రాష్ట్రం హక్కులు కూడా పోతున్నాయని, ఏపీలో రాజధాని కట్టేడి ఇంకెప్పుడని ప్రశ్నించారు. చంద్రబాబు, జగన్, పవన్ కల్యాణ్ ఎవరూ అభివృద్ధిపై మాట్లాడడం లేదన్నారు. దేశంలో అంబేద్కర్ సహకార బ్యాంకు, దక్షిణ భారతదేశంలో సుప్రీంకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. బీజేపీని ఓడించడమే లక్ష్యంగా పని చేస్తామని, రాబోయే రోరజుల్లో ఏపీలో బీఆర్ఎస్ పూర్తిస్థాయిలో బలోపేతం చేయాలన్నారు. ఏపీలో బీఆర్ఎస్ తరఫున బహిరంగ సభ పెట్టాలని సీఎం కేసీఆర్‌ను కోరుతున్నామన్నారు. బీఆర్ఎస్తోనే ఏపీ అభివృద్ధి సాధ్యమని, రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఎంపీలను గెలిపిస్తే ప్రత్యేక హోదా వస్తుందన్నారు. మంత్రి కేటీఆర్ కృషితో నేడు హైదరాబాద్ నగరంలో నేడు గూగుల్, మైక్రోసాఫ్ట్‌తో పాటు ఎన్నో అంతర్జాతీయ ఐటీ పరిశ్రమలు వచ్చాయన్నారు.