హైదరాబాద్, జూలై 19 (నమస్తే తెలంగాణ):ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా అంశం ముగిసిన అధ్యాయమని కేంద్ర ప్రభుత్వం మరోసారి స్పష్టం చేసింది. తెలుగుదేశం ఎంపీ రామ్మోహన్నాయుడు లోక్‌సభలో అడిగిన ప్రశ్నకు కేంద్ర హోంశాఖ సహాయమంత్రి నిత్యానందరాయ్ ఈ మేరకు జవాబిచ్చారు. ప్రత్యేక హోదాకు 14వ ఆర్థికసంఘం ప్రాధాన్యం ఇవ్వలేదని చెప్పారు. కేంద్ర పన్నుల్లో రాష్ర్టాల వాటా 42 శాతానికి పెంచిందని, రెవెన్యూ లోటు ఉన్న రాష్ర్టాలకు అదనపు నిధులు కేటాయించిందని పేర్కొన్నారు. 15వ ఆర్థిక సంఘం కూడా ఆ సిఫారసులను కొనసాగించిందని వివరించారు. విభజన చట్టం హామీలను చాలావరకు నెరవేర్చామని, కొన్ని మాత్రమే పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య వివాదాల పరిషారానికి 28 సమావేశాలు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు.
పోలవరం గడువు పెంపు
ఆంధ్రప్రదేశ్‌లోని పోలవరం ప్రాజెక్టు నిర్మాణ గడువును కేంద్ర ప్రభుత్వం 2024 జూన్ వరకు పొడగించింది. ఈ ఏడాది ఏప్రిల్ నాటికే పోలవరం నిర్మాణం పూర్తి కావాల్సి ఉన్నప్పటికీ, ఏపీ ప్రభుత్వానికి వ్యూహాత్మక ప్రణాళిక లేకపోవడం వల్లనే జాప్యమవుతున్నదని పేర్కొన్నది. నిర్మాణ సంస్థతో సమన్వయ లోపంతోపాటు, కరోనా మహమ్మారి పోలవరం ఆలస్యానికి కారణమయ్యాయని కేంద్ర జలశక్తి శాఖ తెలిపింది.