హైదరాబాద్, ఏప్రిల్ 9 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర పునర్విభజన చట్టంలోని నిబంధనలను ఏపీ ప్రభుత్వం తుంగలో తొక్కుతున్నది. గోదావరి-బనకచర్ల (జీబీ) లింక్ ప్రాజెక్టును చేపట్టేందుకు దూకుడుగా ముందుకు సాగుతున్నది. ఆ ప్రాజెక్టు పనుల కోసం స్పెషల్ పర్పస్ వెహికిల్‌ను (ఎస్పీవీని) ఏర్పాటు చేసింది. ప్రాజెక్టు నిర్మాణానికి కావాల్సిన నిధుల సమీకరణకు ‘జలహారతి’ పేరిట కార్పొరేషన్‌ను ఏర్పాటు చేస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.
జీసీ లింక్ ప్రాజెక్టు ద్వా రా గోదావరి నుంచి 200 టీఎంసీల వరద జలాలను కృష్ణా బేసిన్‌కు, అక్కడి నుంచి బనకచర్ల మీదుగా పెన్నా బేసిన్‌కు మళ్లించేందుకు ఏపీ సిద్ధమైంది. రూ.80,112 కోట్లతో చేపట్టనున్న ఈ ప్రాజెక్టుపై ఇప్పటికే తెలంగాణ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నది. ఆ ప్రాజెక్టుకు ఎట్టిపరిస్థితుల్లోనూ అనుమతులివ్వకూడదని సీడబ్ల్యూసీకి, కేంద్ర జల్‌శక్తి శాఖకు ఫిర్యాదు చేయడంతోపాటు ఇటీవల గోదావరి నదీ యాజమాన్య బోర్డు (జీఆర్ఎంబీ) సమావేశంలోనూ బలంగా వాదనలు వినిపించింది.
ట్రిబ్యునల్ అవార్డుకు విరుద్ధంగా ఈ ప్రాజెక్టును చేపట్టిన ఏపీ.. ఆ పనుల కోసం ఇప్పటికే రూ.1,000 కోట్లు ఖర్చు చేసింది. అయినప్పటికీ ఈ ప్రాజెక్టు కేవలం ప్రణాళికల దశలోనే ఉన్నదని, ఇంకా డీపీఆర్ కూడా సిద్ధం కాలేదని బుకాయిస్తున్న ఏపీ.. మరోవైపు జీసీ లింక్ పనులను వేగంగా పట్టాలెక్కిస్తున్నది. అందులో భాగంగా ఆ ప్రాజెక్టు పనుల కోసం తాజాగా జీబీ జలహారతి కార్పొరేషన్‌ను ఏర్పాటు చేసింది. కేవలం వరద జలాల కోసమే ఈ ఎస్పీవీని నెలకొల్పిన ఏపీ.. బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి రుణాలను తీసుకునేందుకు ఆ కార్పొరేషన్‌కు అధికారాలను కట్టబెట్టింది.