హైరదాబాద్: కేంద్రంలో బీజేపీ సర్కార్ అండతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (Andhra Pradesh) సాగునీటి ప్రాజెక్టుల విషయంలో ఆడిందే ఆట పాడిందే పాట అన్నట్లుగా వ్యవహరిస్తున్నది. శ్రీశైలం (Srisailam) పూర్తిస్థాయిలో నిండకముందే పోతిరెడ్డిపాడు (Pothireddypadu) నుంచి నీటి తరలింపును ప్రారంభించిన ఏపీ సర్కార్.. తాజాగా నాగార్జున సాగర్ (Nagarjuna Sagar) విషయంలోనే అలాగే వ్యవహరిస్తున్నది. చెప్పాపెట్టకుండా సాగర్ కుడి కాలువ నుంచి నీటిని విడుదల చేసుకున్నది. కేఆర్ఎంబీ నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా బుధవారం సాయంత్రం నుంచి నీటిని అక్రమంగా తరలిస్తున్నది.
ఏపీ అక్రమ తరలింపుపై తెలంగాణ నాగార్జున సాగర్ ప్రాజెక్టు అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ అధికారుల తీరుపై కేఆర్ఎంబీకి ఫిర్యాదు చేశారు. కుడి కాలువకు నీడి విడుదల విషయంలో ఏపీ అధికారులు కేఆర్ఎంబీ నుంచి ఎలాంటి అనుమతులు తీసుకోలేదని, సమాచారం ఇవ్వకుండానే బుధవారం సాయంత్రం నీటిని విడుదల చేశారని ఎన్ఎస్పీ ఎస్పీ మల్లికార్జున రావు అన్నారు.