హైదరాబాద్, జూన్ 8 (నమస్తే తెలంగాణ): జేఎన్టీయూ ఆధ్వర్యంలో నిర్వహించే పీజీఈ సెట్ పరీక్షలు సోమవారం నుంచి ప్రారంభంకానున్నాయి. హైదరాబాద్, వరంగల్ నగరాల్లో ఈ పరీక్షలను ఈ నెల 13 వరకు నిర్వహిస్తామని పీజీఈ సెట్ కన్వీనర్ ప్రొఫెసర్ అరుణకుమారి ఒక ప్రకటనలో తెలిపారు. 22,712 మంది విద్యార్థులు ఈ పరీక్షలకు దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు. ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్లలో 19 సబ్జెక్టులకు ఆన్లైన్లో నిర్వహించే ఈ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తిచేశామని పేర్కొన్నారు. విద్యార్థులు ఒరిజినల్ ఐడీ కార్డులను వెంట తెచ్చుకోవాలని తెలిపారు. పీజీ ఇంజినీరింగ్ కోర్సులు చదివేందుకు వెయ్యి మందికి పైగా ఇతర రాష్ర్టాల విద్యార్థులు పీజీఈ సెట్‌కు దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో ఇతర రాష్ర్టాలకు చెందిన విద్యార్థులు 332 మంది ఉండగా, ఏపీ నుంచి 813 మంది ఉన్నారు.