Pattiseema | 100 రోజులు ఏపీలో ఆగకుండా ఎత్తిపోత.. పట్టిసీమతో 65 టీఎంసీల గోదావరి జలాలు తరలింపు!
Pattiseema | పొరుగున ఏపీలో 29-33 శాతం లోటు వర్షపాతం నమోదైంది. అయినా కృష్ణా డెల్టాలో 13 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతున్నది. అక్కడ క్రాప్ హాలిడే ముచ్చటే లేదు. గోదావరి ఆయకట్టుకు ఢోకా లేదు. కారణమేందంటే ప్రాణహిత నుంచి వచ్చిన వరద జలాలను ఏపీ ఒడిసిపట్టడమే! పట్టిసీమ లిఫ్ట్ ద్వారా మళ్లించడమే!
Pattiseema | హైదరాబాద్, అక్టోబర్ 23 (నమస్తే తెలంగాణ) : పొరుగున ఏపీలో 29-33 శాతం లోటు వర్షపాతం నమోదైంది. అయినా కృష్ణా డెల్టాలో 13 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతున్నది. అక్కడ క్రాప్ హాలిడే ముచ్చటే లేదు. గోదావరి ఆయకట్టుకు ఢోకా లేదు. కారణమేందంటే ప్రాణహిత నుంచి వచ్చిన వరద జలాలను ఏపీ ఒడిసిపట్టడమే! పట్టిసీమ లిఫ్ట్ ద్వారా మళ్లించడమే! ఏకధాటిగా 100 రోజులుగా పంపులు నడిపి ఇప్పటికే 65 టీఎంసీలను కేవలం పట్టిసీమ ద్వారానే మళ్లించింది. తెలంగాణలో కరువును అధిగమించే పరిస్థితులే ఉన్నాయి. రాష్ట్రంలో లోటు వర్షపాతం 18-24 శాతానికి మించలేదు. ప్రాణహిత నుంచి మేడిగడ్డ ద్వారా 750 టీఎంసీలు దిగువకు తరలిపోయాయి.
అయినా ఎస్సారెస్పీ ఆయకట్టుకు కూడా ప్రభుత్వం క్రాప్‌హాలిడే ప్రకటించింది. ఇదీ రేవంత్ సర్కార్ పనితీరు. కన్నెపల్లి పంపులను ఆన్‌చేసి ఉంటే ఎస్సారెస్పీతోపాటు సగానికిపైగా తెలంగాణ ప్రాంతాన్ని కరువు నుంచి కాపాడుకొనే అవకాశం ఉండేది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మేడిగడ్డ నుంచి నీటిని లిఫ్ట్ చేయకుండా దిగువకు వదిలిపెడుతూ రాష్ర్టాన్ని కరువు కోరల్లోకి తీసుకెళ్లింది. మరోవైపు దిగువన ఏపీ పట్టిసీమ, తాడిపూడి లిఫ్ట్‌లు ఆన్‌చేసి నీటిని ఎత్తిపోసుకున్నది. కృష్ణా డెల్టాకు సైతం గోదావరి జలాలను మళ్లిస్తున్నది. మొత్తంగా ఏపీ కోసమే రేవంత్ సర్కార్ కన్నెపల్లి పంపులను ఆన్ చేయడం లేదని స్పష్టంగా తెలిసిపోతున్నది.
నిరాటంకంగా పట్టిసీమ ఎత్తిపోతలు
ఏపీ ప్రభుత్వం ఎల్ నినో నేపథ్యంలో ముందస్తుగానే ఎత్తిపోతలు చేపట్టింది. మేడిగడ్డను దాటుకొని దిగువకు వెళ్లిన ప్రాణహిత జలాలను కృష్ణా డెల్టాకు మళ్లించడం ప్రారంభించింది. పోలవరం డ్యామ్ పూర్తయ్యే వరకు కుడికాలువ ద్వారా గోదావరి జలాలను తరలించేందుకు తాత్కాలికంగా ఏలూరు జిల్లాలో పట్టిసీమ లిఫ్ట్ స్కీమ్‌ను ఏపీ గతంలోనే చేప్టటింది. రోజుకు 8,500 క్యూసెక్కుల జలాలను గోదావరి నుంచి లిఫ్ట్ చేసి కుడి కాలువ ద్వారా కృష్ణా డెల్టా ఆయకట్టుకు 80 టీఎంసీల మేరకు సాగునీటిని అందించడం లక్ష్యంగా పెట్టుకున్నది. 2015 నుంచి ఈ స్కీమ్ ద్వారా గోదావరి జలాలను మళ్లిస్తున్నది. పోలవరం కుడికాలువకు సమాంతరంగా తాడిపూడి కాలువ సైతం నిర్మించింది. తాడిపూడి లిఫ్ట్ ద్వారా ఇక్కడా 1,400 క్యూసెక్కుల నీటిని తరలించే ఏర్పాట్లు చేసింది. ఈ సీజన్లో ఆ రెండు కాలువల ద్వారా గోదావరి జలాలను మళ్లించింది.
ఈ సీజన్లో గోదావరిలో ప్రవాహాలు జూలై మొదటి వారంలో ప్రారంభమయ్యాయి. పట్టిసీమ వద్ద 14 మీటర్ల నీటిమట్టం ఉంటేనే నీరు తరలించడానికి వీలవుతుంది. ఈ క్రమంలో జూలై 9న ఆ మేరకు ప్రవాహాలు ప్రారంభం కావడంతో ఏపీ సర్కార్ పట్టిసీమ పంపులను ఆన్చేసింది. ఏపీ మంత్రి నిమ్మల రామానాయుడు స్వయంగా పట్టిసీమ వద్ద జలహారతి ఇచ్చి ఆయా లిఫ్ట్ స్కీమ్‌లను ప్రారంభించారు. అనంతరం జూలై 15న ఇబ్రహీంపట్నం దగ్గరలోని గోదావరి – కృష్ణమ్మ సంగమం వద్ద పూజలు చేసి జలహారతి పట్టారు. గోదావరి నీటిమట్టం కొనసాగిన సమయంలో 22 పంపుల నుంచి 22 మోటర్లతో ఎత్తిపోతలు చేపట్టగా, ఇటీవల నీటిమట్టం కొద్దిగా తగ్గడంతో కొన్ని పంపులను ఆఫ్ చేశారు. ఈ రోజుకూ పట్టిసీమ ద్వారా కుడి కాలువకు దాదాపు 4 వేల క్యూసెకులకు మించి గోదావరి జలాలను తరలిస్తున్నారు.
ఇక జూలై 15 నుంచి మొన్నటివరకు (గురువారం) మొత్తంగా 100 రోజులుగా పంపులు రన్ చేస్తూనే ఉన్నారు. ఇప్పటి వరకు మొత్తంగా 65 టీఎంసీల గోదావరి జలాలను పట్టిసీమ ద్వారా కృష్ణా డెల్టాకు మళ్లించారు. 29 శాతం లోటు వర్షపాతం నమోదైనా డెల్టాలో క్రాప్ హాలిడే ప్రకటించలేదు. పట్టిసీమ ద్వారా వానకాలంలో కృష్ణా డెల్టాలోని 13.08 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీటిని అందించారు. నాగార్జున సాగర్ కుడి కాలువ నుంచీ ఇప్పటివరకు ఏపీ 22 టీఎంసీలను వినియోగించుకున్నది. మొత్తంగా డెల్టాకు 80 టీఎంసీల మేర జలాలను వాడుకున్నది. ఇప్పటికీ నీటి మళ్లింపు కొనసాగిస్తున్నది. ధవళేశ్వరం ద్వారా 150 టీఎంసీలను సైతం గోదావరి డెల్టాకు అందించి క్రాప్ హాలిడే లేకుండా చేసింది.
- పట్టిసీమలో ఎత్తిపోత

జూలై 9 నుంచి నేటివరకు నిరంతరాయంగా గోదావరి జలాలను లిఫ్ట్ చేస్తున్న పట్టిసీమ పంపులు.. ఎల్ నినో హెచ్చరికల నేపథ్యంలో వందరోజులుగా నీళ్లను ఎత్తిపోస్తున్న ఏపీ ప్రభుత్వం
ఏపీ కోసమే మేడిగడ్డ పడావు!
గత ఎండాకాలం చివరి నాటికే ఎస్సారెస్పీతోపాటు, గోదావరి బేసిన్‌లోని జలాశయాలన్నీ డెడ్‌స్టోరేజీకి చేరుకున్నాయి. వానలు కురిసే అవకాశం తక్కువగానే ఉన్నదని వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఎల్ నినో ప్రభావంతో గోదావరిలో అంతంత మాత్రమే వరదలు వచ్చాయి. ఎస్సారెస్పీ ఎగువ, దిగువన ఎల్లంపల్లి, సుందిళ్ల, అన్నారం వరకు వచ్చిన వరద కేవలం 58 టీఎంసీలే. కానీ ఆ బరాజ్‌ల దిగువన మేడిగడ్డ బరాజ్ వద్ద ప్రాణహిత నుంచి ఇప్పటి వరకు వచ్చిన వరద 750 టీఎంసీలు. నిన్న శుక్రవారం రాత్రి 9 గంటల వరకు 21 వేల క్యూసెక్కుల ప్రవాహం కొనసాగుతున్నది. అంటే దాదాపు 2 టీఎంసీల ప్రవాహం. సమృద్ధిగా వరద వచ్చినా కాంగ్రెస్ ప్రభుత్వం దానిని వినియోగించలేదు. కన్నెపల్లి పంప్‌హౌస్ మోటర్లు సిద్ధంగా ఉన్నాయి. రోజుకు రెండు టీఎంసీల చొప్పున ఎత్తిపోసుకొనే సామర్థ్యం ఉన్నది.
ఎల్లంపల్లి నుంచి 58 టీఎంసీలు దిగువకు
సాకులు చెప్తూ ప్రాణహిత జలాలను వదిలిపెట్టిన ప్రభుత్వం కనీసం ఎల్లంపల్లి జలాలనూ ఒడిసిపట్టలేదు. ఈ సీజన్లో ఎల్లంపల్లి రిజర్వాయర్‌కు మొత్తంగా 58 టీఎంసీలకుపైగా జలాలు వచ్చాయి. వాటిని ఒడిసిపట్టినా మిడ్‌మానేరు, ఎల్ఎండీతోపాటు అనేక రిజర్వాయర్లు, చెరువులను నింపుకోవడమే కాకుండా కొంత మేరకైనా ఆయకట్టుకు నీరందించే అవకాశం ఉండేది. కానీ ప్రభుత్వం ఆ పనినీ చేయలేదు. ఈ సీజన్లో ఎల్లంపల్లి నుంచి ఇప్పటి వరకు 21 టీఎంసీల నీటినే వినియోగించింది.
- గోదావరిలో వరద ప్రారంభమైన వెంటనే జూలై 9న పట్టిసీమ పంపులు ఆన్ చేశారు.
- జూలై 15వ తేదీన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు జలహారతి ఇచ్చారు.
- తెలంగాణ మీదుగా గోదావరి నుంచి దిగువకు వెళ్లిన జలాలు 1,664 టీఎంసీలు
- ప్రాణహిత నుంచి మేడిగడ్డ మీదుగా గోదావరి నదిలో తరలిపోయినవే 750 టీఎంసీలు
- ఏపీ పట్టిసీమ ద్వారా కృష్ణా డెల్టాకు వాడుకున్నవి 65 టీఎంసీలు
- ధవళేశ్వరం వద్ద గోదావరి డెల్టాకు వాడుకున్నవి 150 టీఎంసీలు

Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Pattiseema | 100 రోజులు ఏపీలో ఆగకుండా ఎత్తిపోత.. పట్టిసీమతో 65 టీఎంసీల గోదావరి జలాలు తరలింపు!
KTR | కాళేశ్వరాన్ని తిట్టి.. కరువులోకి నెట్టి.. కాంగ్రెస్ నిర్లక్ష్యంతోనే రాష్ర్టానికి దుర్భిక్షం.. కేటీఆర్ ధ్వజం
JIO IPO | దుమ్మురేపిన జియో ఐపీవో.. ముగిసిన మెగా పబ్లిక్ ఇష్యూ.. 22.19 రెట్లు ఓవర్ సబ్‌స్ర్కైబ్
Flying Car India | ఇంజినీరు కాకున్నా ఎగిరే కారు తయారు చేశాడు.. ఉత్తరాఖండ్వాసి అద్భుతం!
YTPS | వైటీపీఎస్పైనే సర్కార్ ఆశలు.. రాష్ట్రంలో విద్యుత్తు కొరత నేపథ్యంలో ‘యాదాద్రి’పైనే ఫోకస్
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

