హైదరాబాద్, జూన్ 20 (నమస్తే తెలంగాణ): మార్గదర్శి చిట్‌ఫండ్ కేసులో 2 జీవోల ద్వారా ఏపీ ప్రభుత్వం రూ.1035 కోట్లను అటాచ్ చేసినట్టు ఏపీ సీఐడీ విభాగం ఏడీజీ సంజయ్ మంగళవారం వెల్లడించారు. ఈ కేసును వివిధ కోణాల్లో విచారిస్తున్న ఏపీ సీఐడీ.. మంగళవారం హైదరాబాద్‌లో మీడియా సమావేశం నిర్వహించింది. ఏడీజీ సంజయ్ మాట్లాడుతూ.. మార్గదర్శి కేసును మార్చి 10 నుంచి దర్యాప్తు చేపట్టామని, ఇప్పటివరకు 7 ఎఫ్ఐఆర్లు నమోదు చేశామని చెప్పారు. కేసులో ఏ1గా రామోజీరావు, ఏ2గా శైలజాకిరణ్ తదితరులను నిందితులుగా చేర్చినట్టు తెలిపారు.
ఐదుగురు నిందితులను విచారించినా.. వారు సహకరించట్లేదని వెల్లడించారు. రూ.వేల కోట్ల లావాదేవీలు నిర్వహిస్తున్న మార్గదర్శి కంపెనీ లెకలు చూస్తే కేసు తీవ్రత అర్థం చేసుకోవచ్చని చెప్పారు. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్‌శాఖ ఇచ్చిన సమాచారంతో ఆడిటింగ్ చేశామని, 108 బ్రాంచ్‌లతో ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో మార్గదర్శి చిట్స్ కార్యకలపాలు సాగిస్తున్నదని.. ఈ నాలుగు రాష్ర్టాల్లో మార్గదర్శిని మూసివేసే పరిస్థితి రావొచ్చని తెలిపారు.