Pawan Kalyan | కుభీర్, నవంబర్ 16 : తెలంగాణలో ఆరు గ్యారెంటీలంటూ ప్రజలను మభ్యపెట్టి ఏ ఒక్క హామీని నెరవేర్చకుండా కాంగ్రెస్ పార్టీ, సీఎం రేవంత్‌రెడ్డి చేతులెత్తేశారని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అశోక్‌రావు చౌహాన్ విమర్శించారు. నిర్మల్ జిల్లా కుభీర్ మండలానికి ఆనుకుని ఉన్న మహారాష్ట్రలోని బోఖర్ తాలూకా పాలజ్‌లో శనివారం నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో వారు పాల్గొన్నారు.
భోఖర్ మహాయుతి అభ్యర్థి జయాచౌహాన్, నాందేడ్ ఎంపీ అభ్యర్థి సంతుక్రావు అంబర్టే తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు సభలో మాట్లాడుతూ.. మహారాష్ట్రలో రిజర్వేషన్ల కోసం కులాలను రెచ్చగొట్టి కులరాజకీయాలకు తెరలేపారని ఆరోపించారు. హామీల అమలుతోపాటు పరిపాలనలో ఫెయిల్ అయిన తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి ఫొటో పెట్టి మహారాష్ట్ర ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓట్లు దండుకోవాలని ప్రయత్నిస్తున్నదని ధ్వజమెత్తారు. ‘మీ ఆశీర్వాదంతో మహారాష్ట్రలో మళ్లీ అధికారంలోకి వచ్చేది మహాయుతి కూటమే’నని జోస్యం చెప్పారు.