Ande Sri | ప్రముఖ తెలుగు సాహితీవేత్త, గేయ రచయిత అందెశ్రీ మరణం బాధాకరమని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర గీతం “జయ జయహే తెలంగాణ జననీ జయ కేతనం” రచించి తెలంగాణ చరిత్రలో ఆయన చిరస్మరణీయంగా నిలిచారని కొనియాడారు. అందెశ్రీ మృతి పట్ల తీవ్ర సంతాపం తెలిపారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. అందెశ్రీ గారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.
అందెశ్రీ హఠాన్మరణం దిగ్భ్రాంతి కలిగించిందని పవన్ కల్యాణ్ తెలిపారు. ఆయన రచనా ప్రస్థానం ప్రతి ఒక్కరినీ ఆకట్టుకొంటుందని తెలిపారు. గొర్రెల కాపరిగా, భవన నిర్మాణ కూలీగా జీవితం మొదలుపెట్టి అక్షర యాత్ర చేశారని అన్నారు. తెలంగాణ జానపదాలపై, మాండలికంపై పట్టు కలిగిన రచయిత ఆయన అని కొనియాడారు. పలు సినీ గీతాలు రచించారని.. ‘మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు…’ గీతం వింటే సమాజాన్ని అందెశ్రీ ఎంతగా చదివారో అర్థమవుతుందని అన్నారు.