హైదరాబాద్, జూలై 17 (నమస్తే తెలంగాణ): దేశంలో జాతీయ రహదారులు తన ఘనతేనని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు చెప్పుకున్నారు. వాజపేయి ప్రధానిగా ప్రధానిగా ఉన్నప్పుడు తానే నేషనల్ హైవే ఆలోచన ఇస్తే ఆయన రోడ్లు నిర్మించారని బడాయికిపోయారు. నంద్యాల జిల్లా నందికొట్కూరు మండలం మల్యాలలో గురువారం పర్యటించిన ఆయన జలహారతి కార్యక్రమంలో మాట్లాడారు.
‘ఇప్పుడు మీరంతా చూస్తున్న రోడ్లను చూసి గుర్విస్తున్నా.. ఎక్కడికి వెళ్లాలన్నా నేషనల్ హైవే ఎక్కితే హుషారుగా వెళ్లిపోవచ్చు. అదంతా నా ఘనతే’ అని వ్యాఖ్యానించారు. ఢిల్లీలో నదీజలాల అంశంపై బుధవారం జరిగిన ముఖ్యమంత్రుల భేటీని ప్రస్తావిస్తూ.. ‘ఏం తమ్ముళ్లు హైదరాబాద్‌ను ఎవరు అభివృద్ధి చేశారు..? నేనే కదా డెవలప్ చేసింది’ అంటూ పాత పాటే పాడారు.
మనదేశంలో 1956లోనే జాతీయ రహదారుల చట్టం వచ్చింది. నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా చట్టం-1988 ద్వారా నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియాను స్థాపించారు. 1971-81 మధ్యకాలంలో దేశంలో 31,671 కిలోమీటర్ల జాతీయ రహదారులు ఉన్నాయి. 1981-91 మధ్య కాలంలోనే అవి 33,650 కిలోమీటర్లకు పెరిగాయి. 2004లో ప్రధానిగా వాజపేయి పదవీకాలం ముగిసే నాటికి దేశంలో 65,569 కిలోమీటర్ల జాతీయ రహదారులు ఉన్నాయి.
ఈ విషయాలన్నీ పక్కనబెట్టి హైవేల ఘనత తనదేనంటూ చంద్రబాబు నిస్సిగ్గుగా చెప్పుకోవడం విస్మయానికి గురిచేస్తున్నది. 1999-2004లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు చంద్రబాబు ముఖ్యమంత్రిగా వ్యవహరించారు. 21 ఏండ్ల తర్వాత కూడా హైదరాబాద్‌ను తానే అభివృద్ధి చేశానని చెప్పుకోవడంతో నెటిజన్లు ఆయనపై విమర్శలు గుప్పిస్తున్నారు. హైదరాబాద్‌లో అభివృద్ధి మీ ఘనతే అయితే అమరావతిని 2014-19, 2024-25 కాలంలో ఎందుకు అభివృద్ధి చేయలేకపోతున్నారని దెప్పిపొడుస్తున్నారు.