హైదరాబాద్, నవంబర్ 11 (నమస్తే తెలంగాణ) : నర్సింగ్ విద్యలో అక్రమాల బాగోతం ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, నల్లగొండ జిల్లాల్లోని 23 నర్సింగ్ స్కూళ్లపై గత నెలలో నర్సింగ్ కౌన్సిల్‌కు పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందాయి. హైదరాబాద్ హయత్‌నగర్‌లో ఒకే నర్సింగ్ స్కూల్ బిల్డింగ్‌లో ఏకంగా 8 స్కూళ్లు నిర్వహించడం, నల్లగొండలో సైతం ఒకే బిల్డింగ్‌లో నాలుగు స్కూళ్లు నిర్వహిస్తున్నట్టు ‘నమస్తే తెలంగాణ’ వరుస కథనాలతో నర్సింగ్ స్కూళ్లలో జరుగుతున్న అవకతవకలను వెలుగులోకి తెచ్చింది. దీంతోపాటు అనుమతుల్లో సైతం పెద్ద ఎత్తున డబ్బులు చేతులు మారుతున్న విషయాలను నిగ్గు తేల్చింది. వసూళ్ల పర్వానికి తెరలేపిన ఓ ఉన్నతాధికారిణి పదవీ కాలం పొడిగింపు కోసం ఇటీవల ప్రయత్నించినా.. తీవ్ర ఆరోపణల నేపథ్యంలో సదరు అధికారిణి పదవీ కాలాన్ని ప్రభుత్వం పొడిగించలేదు.
ఇక ‘నమస్తే తెలంగాణ’ వరుస కథనాలతో స్పందించిన వైద్యశాఖ ఉన్నతాధికారులు 14 నర్సింగ్ స్కూళ్లకు గత నెల 19న నోటీసులు జారీ చేశారు. వారంలోగా వివరణ ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొన్నారు. అయితే మూడు వారాలు గడుస్తున్నా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం పలు అనుమానాలకు తావిస్తున్నది. నర్సింగ్ స్కూళ్ల యాజమాన్యాలు నేరుగా రంగంలోకి దిగి, పలువురు అధికారులను ప్రసన్నం చేసుకున్నట్టు ఆరోపణలున్నాయి. అందుకే నోటీసులపై చర్యలను కొంత మంది తొక్కిపెడుతున్నట్టు సమాచారం. ప్రముఖంగా ఓ మంత్రి అనుచరుడి పేరు వినిపించడంతోనే చర్యల్లో తాత్సారం చేస్తున్నారా..? అనే అనుమానాలున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి అక్రమాలకు పాల్పడిన నర్సింగ్ స్కూళ్లపై చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.
హెల్త్ సెక్రటరీకి రిపోర్టు పంపాం
ఇదే విషయమై ‘నమస్తే తెలంగాణ’ అకాడమిక్ డీఎంఈ శివరాం ప్రసాద్‌ను వివరణ కోరగా.. నోటీసులకు నర్సింగ్ స్కూళ్లు పంపిన వివరణను హెల్త్ సెక్రటరీకి పది రోజుల క్రితం పంపినట్టు తెలిపారు. హెల్త్ సెక్రటరీ కార్యాలయం నుంచి తదుపరి చర్యలపై ఎలాంటి ఆదేశాలు రాలేదని వివరించారు. కార్యాలయం నుంచి వచ్చిన ఉత్తర్వుల ఆధారంగా నర్సింగ్ స్కూళ్లపై చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.